ఆకలేసి కోతికోసం చిరుత పరుగు… కరెంట్ షాక్ తో మృతి

ఆకలి కేక జంతువు ప్రాణం తీసింది. అదేమంటే.. ఆహారం కోసం కోతిని వేటాడుతూ పరిగెత్తిన చిరుతపులి ప్రమాదవశాత్తూ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి ప్రాణాలు విడిచింది. కోతి కూడా దానికంటే ముందే షాక్‌తో చనిపోయింది.

ఆహారం కోసం కోతిని పట్టుకొనేందుకు ప్రయత్నించిన ఓ చిరుత పులి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబై శివారులో చోటు చేసుకుంది. కోతిపైకి దూకిన చిరుత ట్రాన్స్‌ఫర్‌పై పడి కరెంట్ షాక్‌తో మృతిచెందింది. కాగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవ్ గ్రామంలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఈఘటన జరిగింది.

కాగా ఆకలితో ఉన్న దానికి ఓ కోతి కనిపించింది. దీంతో కోతిని చంపి తినేసి ఆకలి తీర్చుకోవాలని భావించింది. కోతి భయంతో ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూకింది. చిరుత కూడా దానిపైకి దూకింది. దీంతో ఆ రెండూ కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు విడిచాయి. ట్రాన్స్‌‌ఫిర్మర్‌పై చిరుత మృతదేహం వేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

అధికారులు కోతి, చిరుత కళేబరాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే లాక్‌డౌన్ తో అక్కడ జనసంచారం లేకపోవడంతో చిరుత ఆ ప్రాంతానికి వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.