టిక్ టాక్ మద్యదానం తెచ్చిన తంటా… యువకుడు అరెస్ట్

లాక్‌డౌన్‌లో మద్యం దొరక్క అల్లల్లాడిపోతున్న మందుబాబులకు లిక్కర్‌ను ఉచితంగా పంపిణీ చేసిన యువకుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో టిక్‌టాక్ చాలామందికి వ్యసనంగా మారిపోయింది. రోజూ అనేక వీడియోలు తీస్తూ.. లైకులు, కామెంట్ల కోసం అనేకమంది పాకులాడుతున్నారు.అయితే ఒక్కోసారి ఇలాంటి వీడియోలు ఇబ్బందులను కూడా తెస్తాయి.

కొద్దిరోజుల క్రితం తమిళనాడులో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ యువతి ఐసోలేషన్ వార్డులోనే టిక్‌టాక్ వీడియో చేసి పోస్ట చేసింది. ఫలితంగా ముగ్గురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యువకుడు చేసిన వీడియో అతడిని ఏకంగా జైలుపాలు చేసింది. లాక్ డౌన్ సమయంలో అన్ని దుకాణాలతో పాటు మద్యం షాపులు కూడా మూతపడిన విషయం తెలిసిందే. మద్యంలేక మందు బానిసలు పిచ్చాసుపత్రులకు వెళ్లిన విషయం కూడా తెలిసిందే.

ఇలాంటి సమయంలో తాజాగా హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన కుమార్ అనే యువకుడు చంపాపేటలోని బ్రాహ్మణవాడీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉండే వారికి మద్యం ఉచితంగా పంపిణీ చేశాడు. చేతిలో మద్యం బాటిళ్లు పట్టుకుని ప్లాస్టిక్ గ్లాసుల్లో వారికి మద్యం పోశాడు. ఈ సమయంలో అతడు సుమారు 10 మద్యం బాటిళ్ల మద్యం దానం చేశాడు. ఈ తతంగాన్ని అతడి స్నేహితులు వీడియో తీసి టిక్‌టాక్‌లో పెట్టారు. కాగా ఈ వీడియో ఇప్పుడు  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇది పోలీసుల దృష్టికి చేరింది. ఆ వీడియో లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించేలా ఉందని భావించిన సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు కుమార్‌పై సెక్షన్ 34(a) ఆఫ్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.