హెలికాప్టర్ మనీ తప్ప మరో మార్గం లేదు

విశ్వాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ప్రపంచ దేశాలన్నీ అతులాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెకేందుకు ‘హెలికాప్టర్‌ మనీ’ అనే కొత్తం అంశాన్ని తెరపైకి తెచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. తాజాగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. అయితే ఇప్పుడు ‘హెలికాప్టర్‌ మనీ’ అంటే ఏమిటి అన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. హెలికాప్టర్‌ మనీ అంటే… హెలికాప్టర్ నుంచి డబ్బును వెదజల్లడం అనుకుంటారు. అయితే ఓ రకంగా అలాంటిదే. ఎలాగంటే.. కేంద్ర ప్రభుత్వాలు, బ్యాంకులు నగదు నిల్వలను మార్కెట్‌లోకి తీసుకురావడమే ‘హెలికాప్టర్‌ మనీ’ అంటే అర్థం.
ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు వారికి తక్కువ వడ్డీకి నగదు అందజేస్తారు. వస్తువుల రేట్లు పడిపోయి మార్కెట్లు సంక్షోభంలోకి వెళ్లకుండా ఆర్థిక సమతుల్యత సాధించడమే హెలికాప్టర్‌ మనీ ప్రధాన ఉద్దేశం. అయితే ఇది చరిత్రలో తొలిసారిగా.. ప్రముఖ ఆర్థికవేత్త మిల్టన్‌ ఫ్రైడ్‌మన్‌ 1969లో హెలికాప్టర్‌ మనీ విధానాన్ని ప్రతిపాదించారు. కానీ.. ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బెన్‌ బెర్నాంకి దీనిని 2002లో ప్రాచుర్యంలోకి తెచ్చారు.  2003లో జపాన్‌ సంక్షోభ సమయంలో దీనిని ప్రయోగంలోకి తెచ్చారు. సాధారణంగా ఆర్థికరంగంపై ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్‌), ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్‌) తీవ్ర ప్రభావం చూపుతాయి. ధరలు పెరుగడం ద్రవ్యోల్బణానికి దారితీస్తే.. కొనుగోలు శక్తి తగ్గి ధరలు పడిపోవడం ప్రతి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఏది ఎక్కువైనా.. ఏది తక్కువైనా ఆర్థిక వ్యవస్థమీదనే దెబ్బపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆర్థిక సమతుల్యత సాధించేందుకు  ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి.
అయితే హెలికాప్టర్‌ మనీ కొన్ని సందర్భాలలో క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌గా పని చేస్తుంది. అదెలాగంటే. వడ్డీరేట్లు జీరోస్థాయికి పడిపోయి.. ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు నగదు నిల్వలను ఎక్కువగా వినియోగంలోకి తెచ్చి వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చేస్తారు. దీంతో ప్రజల కొనుగోలుశక్తి పెరిగి మార్కెట్లు కాస్త పుంజు కుంటాయి. ముఖ్యంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు నిధులను భారీగా రిలీజ్ చేసి..  అవి నేరుగా వినియోగదారుడికి అందేలా చర్యలు తీసుకోవడం దీని ప్రధానలక్ష్యం. ప్రస్తుతం డిఫ్లేషన్‌ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున దానిని అడ్డుకోవడానికి హెలికాప్టర్‌ మనీ విధానం అవసరమని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. నగదు నిల్వలను మార్కెట్‌లోకి విస్తృతంగా అందుబాటులోకి తేవడం వలన ఆర్థిక వ్యవస్థ మెరుగు పడేందుకు ఇది ఉత్తమమైన మార్గమని ఆర్థిక నిపుణులు కూడా వెల్లడిస్తున్నారు.
అయితే ఆయా రాష్ట్రాల మొత్తం సంపద (జీఎస్డీపీ)లో 5శాతం వరకు అప్పులు తీసుకునే విధంగా ‘ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌(ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిని మూడు నుంచి ఐదు శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్‌ తాజాగా తెలిపారు. సహజంగా రాష్ట్రాల జీఎస్‌డీపీలో మూడు శాతం వరకు ప్రతి ఏడాది అప్పు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. రెవెన్యూ లోటు లేకుండా స్థిరంగా ఆదాయం పెంచుకుంటున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం 3నుంచి 3.25 లేదా 3.5 శాతం వరకు అప్పులు తీసుకోవడానికి అనుమతినిస్తుంది. కాగా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న ఈ తరుణంలో రాష్ట్రాలు తమ జీఎస్డీపీలో రెండు శాతం ఎక్కువ అప్పు తీసుకోగలిగితే మార్కెట్లను పుంజుకొనేలా చేయవచ్చని సీఎం కేసీఆర్ తెలిపారు.
అంతేకాకుండా 1918లో ప్రపంచంలో స్పానిష్ ఫ్లూ వచ్చింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ రెండు సందర్భాల్లో ప్రపంచం ఓ విధానాన్ని అనుసరించింది. ప్రపంచం అవలంబిస్తున్న విధానం క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూఈ) భారత్‌లోనూ అమలు చేయాలి. ఇదే ఏకైక మార్గం. మనకు ఆర్బీఐ ఉన్నట్లుగా అన్ని దేశాలకు ఉండే అలాంటి బ్యాంకులు ఈ క్యూఈని అమలు చేస్తారని ఆయన తెలిపారు.  దేశానికి ఉండే జీడీపీలో కొంత శాతం నిర్ణయించి ఆ బ్యాంకులు కేటాయిస్తాయి. ఆ నిధుల ద్వారా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నుంచి బయటపడతారు. ఈ ప్రక్రియను ప్రస్తుతం అమెరికా ఫెడరల్ బ్యాంకు ఆ దేశంలో 10శాతం (2 ట్రిలియన్ డాలర్లు) ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ లండన్‌లోనూ యూకే జీడీపీలో నుంచి 15 శాతం క్యూఈ ఇచ్చింది. మనకు కూడా ఇప్పుడు ఆర్బీఐ నుంచి డబ్బు తీసుకోవడం తప్ప మరే మార్గం లేదని స్పష్టం చేశారు. ‘మన దేశం నిర్ధారించిన జీడీపీ సుమారు రూ.203 లక్షల కోట్లు ఉంది.
ఇందులో కనీసం 5 శాతం క్యూఈ చేస్తే రూ.10 లక్షల కోట్ల డబ్బు మనకు వస్తుంది. దాన్ని వివిధ రూపాల్లో మనం వెచ్చించవచ్చు. ప్రస్తుతం అసంఘటిత రంగంలో ఎంతో మంది వ్యాపారులు నష్టపోతున్నారు. ప్రభుత్వాలు సహకరించాలని వారు కోరుతున్నారు. రైతుల నుంచి ధాన్యాలు కూడా కొనాలని దేశ వ్యాప్తంగా రైతులు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో క్యూఈ ద్వారా వచ్చే డబ్బుతో మనం ఈ రంగాలన్నింటికీ మేలు చేకూర్చవచ్చని కేసీఆర్ వివరించారు.