నేడు స్టార్‌ హీరోయిన్‌ పుట్టినరోజు

నేడు స్టార్‌ హీరోయిన్‌ పుట్టినరోజు

ఆమె చూపుల్తోనే బాణం వదులుతుంది.. తన ఒంపుసొంపులతో నయాగరా జలపాతాన్ని గుర్తు చేస్తుంది.. తన నవ్వుతో ఇంద్రధనస్సును నేలమీదకు తీసుకొస్తుంది.. డ్యాన్స్‌తో నెమలి నాట్యాన్ని కళ్ల ముందుంచుతుంది.. నటనతో అందరినీ ఫిదా చేస్తుంది.. ఆమె మరెవరో కాదు స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌.. నేడు(జూలై 16న) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈ హీరోయిన్‌ ఇప్పటివరకు ఎంత సంపాదించింది? ఎంత వెనకేసుకుందో తెలుసుకుందాం..

‘బూమ్‌’ సినిమాతో నటిగా కెరీర్‌ ఆరంభించింది కత్రినా కైఫ్‌. తొలి చిత్రంలోనే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించే ఆఫర్‌ కొట్టేసిన ఈ భామ తర్వాత ‘మల్లీశ్వరి’ సినిమాతో టాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డును కూడా అందుకుంది. కానీ తర్వాత ఆమె ఇక్కడ పెద్దగా సినిమాలేమీ చేయలేదు. ‘అల్లరి పిడుగు’ చిత్రం తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్‌ ‘చిక్నీ చమేలీ’, ‘షీలాకీ జవానీ’ అంటూ ఐటం సాంగ్స్‌తోనూ అదరగొట్టింది.

సుమారు 40కి పైగా సినిమాల్లో ఆడిపాడిన కత్రినా.. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.  ఆమెకు ముంబైలో ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది.లండన్‌లోనూ ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కోట్లు విలువ చేసే భూమి కూడా తన పేరు మీద ఉందట. ఇక కార్ల మీద మోజు పడే కత్రినా గ్యారేజీలో ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ వోగ్‌ ఎల్‌డబ్ల్యూబీతో పాటు మెర్సిడిస్‌ ఎమ్‌ఎల్‌ 350, ఆడీ క్యూ 7 కార్లు కూడా ఉన్నాయి. మొత్తంగా కత్రినా కైఫ్‌కు రూ.150 కోట్ల పైచిలుకు ఆస్తి ఉండొచ్చని సమాచారం.