సౌరవ్‌ గంగూలీపై సంచలన వ్యాఖ్యలు

సౌరవ్‌ గంగూలీపై సంచలన వ్యాఖ్యలు

టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డే కెప్టెన్సీ మార్పు గురించి అసలు ఆయన తనతో చర్చించలేదని స్పష్టం చేశాడు. అదే విధంగా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొనే అంశంపై కూడా తనతో మాట్లడలేదని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మకే… వన్డే సారథ్య బాధ్యతలు కూడా అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీ20 కెప్టెన్‌గా వైదొలుగుతానని ప్రకటించినపుడే వన్డే సారథిగా కొనసాగుతానని కోహ్లి చెప్పినప్పటికీ.. ఈ మేరకు సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్‌ ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు పేర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సైతం… టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని అభ్యర్థించినా కోహ్లి వినలేదని పేర్కొన్నాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపానికి లోనైన కోహ్లి వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో బుధవారం మీడియా ముందుకు వచ్చిన కోహ్లి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే సెలక్షన్‌కు తాను ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశాడు. అదే విధంగా గంగూలీ తనతో కమ్యూనికేట్‌ అవలేదని బాంబు పేల్చాడు.

ఈ మేరకు.. ‘‘టీ20 కెప్టెన్సీ వదిలేయవద్దని నాకు ఎవరూ చెప్పలేదు. బీసీసీఐ, అధ్యక్షుడి నుంచి ఇలాంటివి ఊహించలేదు. వన్డే కెప్టెన్సీ మార్పు గురించి నాతో చర్చించలేదు. సెలక్షన్‌ కమిటీ సమావేశానికి గంటన్నర ముందు నాకు సమాచారమిచ్చారు. టెస్టు జట్టు గురించి చీఫ్‌ సెలక్టర్‌ నాతో చర్చించారు. సమావేశం ముగిసే సమయానికి నన్ను పిలిచి.. ‘‘నువ్వు ఇక వన్డే కెప్టెన్‌గా ఉండబోవు’’అని చెప్పారు’’ అంటూ గంగూలీ వ్యాఖ్యలను కోహ్లి ఖండించాడు.