ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో నిత్య పోరాటం చేస్తూ వస్తున్నారు. కానీ చలికాలంలో రక్తపోటు సమస్యలు మరింత పెరుగుతాయి. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీని కారణంగా శరీరంలో రక్త ప్రసరణను కూడా చలికాలం అడ్డుకుంటుంది. ఈ కారణంగా మన శరీరానికి కావలసినంత వేడి అందదు. దీని కారణంగా చలికాలంలో అధిక బ్లడ్ ప్రెషర్ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇది తీవ్రమైనదిగా కూడా మారుతుంది. ఇది రక్తపోటు స్థాయిని పెంచడమే కాకుండా, దానికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా తరచుగా పెరుగుతాయి.
చల్లని వాతావరణంలో రక్తనాళాలు, ధమనులు సంకోచానికి గురవుతాయి. దీని కారణంగా శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరా కావడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. అలాగే తేమ, వాతావరణ పీడనం, మేఘాల ఆవరణం, చలిగాలి… వంటి ఆకస్మిక మార్పుల వల్ల కూడా రక్తపోటు పెరగొచ్చు. ముఖ్యం 65 ఏళ్లు వయసు దాటిన వారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే చలికాలంలో వ్యాయామం చేయకపోవడం, బరువు పెరగడం వంటి వాటి వల్ల కూడా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.
అధిక బీపీ లేదా రక్తపోటుతో సంబంధం ఉన్న చెడ్డ విషయం ఏమిటంటే.. చాలా మందికి ఈ వ్యాధి చాలా ఆలస్యంగా నిర్ధారణ అవుతుంది. ప్రజలు దాని లక్షణాలను అర్థం చేసుకోలేరు లేదా ఆలస్యంగా తెలుసుకుంటారు. చాలా సార్లు పరిస్థితి చాలా తీవ్రంగా మారే వరకు రోగి తన పరిస్థితి గురించి తెలుసుకోలేడు. ప్రజలకు దాని గురించి తెలియదు. దాని కారణంగా ఇది సమస్యగా మారుతుంది. విపరీతమైన అలసట, విపరీతమైన తలనొప్పి, విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బంది, ముక్కు నుంచి రక్తం కారడం, శ్వాసకోశ సమస్యలు వంటి లక్షణాలు ఎక్కువగా లేదా.. వీటిలో ఏ మూడు సమస్యలైనా తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు రక్తపోటు పరీక్ష చేయించుకోవాలి.
అధిక రక్తపోటు రోగుల సంఖ్య దేశంలో వేగంగా పెరుగుతోంది. విచిత్రం ఏంటంటే యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది జీవనశైలికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.ప్రతిరోజూ మీ రక్తపోటు స్థాయిని తనిఖీ చేయించుకోవాలి మీరు వైద్యుడికి చూపించినట్లయితే ఆయన సలహాను జాగ్రత్తగా పాటించండి.ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినండి.తప్పకుండా వ్యాయామం చేయండి. కానీ, భారీ వ్యాయామాలు చేయకుండా ఉండండి. అదేవిధంగా నిపుణుడి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామాలు చేయండిఎండలో, చల్లని గాలిలో ఎక్కువసేపు ఉండకండి.
మీరు ఒకవేళ అలా ఉండాల్సి వచ్చినట్టయితే.. మీ స్వంత భద్రతను జాగ్రత్తగా చూసుకోండి.మార్కెట్‌లో అనేక రకాల బీపీ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక మెషిన్‌ను కొనుగోలు చేసి రోజూ బీపీని చెక్ చేసుకోవాలి. దీనివల్ల బీపీ ఎంత ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. రోజూ వేళకు భోజనం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్‌ను మానేయాలి. మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ అయినా సరే చేయాలి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది.
చలికాలంలో కాఫీ, మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువ. నిజానికి వీటిని తాగడం వల్ల శరీరంలోని వేడిని త్వరగా కోల్పోతారు. దీని కారణంగా రక్తనాళాలు మరింత కుచించుకుపోతాయి. దీంతో రక్తపోటు ఇంకా పెరిగిపోతుంది. రోజు రెండుసార్లు కంటే కాఫీ తాగకపోవడం ఉత్తమం. అలాగే ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.ఒకే మందపాటి జాకెట్ లేదా స్వెట్టర్ వేసుకునే బదులు రెండు మూడు పొరల రూపంలో డ్రెస్ వేసుకోవడం ఉత్తమం. ఇలా పొరల దుస్తులు ధరించడం వల్ల వెచ్చగా అనిపిస్తుంది. మందపాటి ఒకే జాకెట్ ధరించడం వల్ల శరీరం సులభంగా వేడిని కోల్పోయే అవకాశం ఉంది.
చల్లని ప్రదేశంలో ఎక్కువ సేపు ఉండవద్దు. అలా అని చెప్పి ఎండలోనూ మరీ ఎక్కువ సేపు ఉండవద్దు. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకే రకంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో రక్త సరఫరా సక్రమంగా ఉంటుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. కూరగాయలు, పండ్లను అధికంగా తీసుకోవాలి. వాటిల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. అలాగే కొవ్వు తీసిన పాలు తాగాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, చేపలు, గుడ్లు, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే బీపీ అదుపులోకి వస్తుంది.
హైబీపీని తగ్గించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు తులసి ఆకులను కోసి నేరుగా అలాగే నమిలి మింగాలి. లేదా 1 టీస్పూన్ మోతాదులో తులసి ఆకుల రసం తాగాలి. దీంతో బీపీ తగ్గుతుంది. తులసి ఆకుల్లాగే కరివేపాకులు కూడా బీపీకి బాగానే పనిచేస్తాయి. వీటిని రోజూ ఉదయం పరగడుపునే 10 ఆకుల చొప్పున తింటుండాలి. హైబీపీ తగ్గుతుంది. వేపాకులు కూడా బీపీని తగ్గించడంలో ఉపయోగపడతాయి. వేపాకుల రసం 1 టీ స్పూన్ మోతాదులో ఉదయం పరగడుపునే సేవించాలి. నాలుగైదు వేపాకులను అలాగే నమిలి మింగుతుంటే బీపీ అదుపులోకి వస్తుంది.