అసెంబ్లీ గేటు వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

అసెంబ్లీ గేటు వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ అసెంబ్లీ గేటు వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో ఒంటికి నిప్పంటించుకుని ప్రాణాపాయ స్థితిలో పడింది. స్థానిక మీడియా కథనం ప్రకారం… అంజనా(35) అనే మహిళకు గతంలో అఖిలేశ్‌ తివారి అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కొన్నాళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆసిఫ్‌ అనే యువకుడు ఆమెకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో అతడిని పెళ్లి చేసుకునేందుకు ఇస్లాం మతం స్వీకరించిన, అంజన తన పేరును ఆయిషాగా మార్చుకుంది. కొన్నాళ్ల తర్వాత ఆసిఫ్‌ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిపోగా, ఆమె అత్తింట్లో ఉండిపోయింది.

ఈ క్రమంలో భర్త తరఫు బంధువులు తనను వేధిస్తున్నారంటూ ఆయిషా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు మహారాజ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. దీంతో ఆవేదన చెందిన బాధితురాలు మంగళవారం లక్నోలోని అసెంబ్లీ గేటు ఎదుట అగ్నికి ఆహుతి అయ్యేందుకు ప్రయత్నించింది. అక్కడే విధుల్లో ఓ పోలీస్‌ అధికారులు మంటలార్పి, ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన పోలీస్‌ ఉన్నతాధికారి సోమన్‌ వర్మ, ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.