అత్తింటి ఆరళ్ల‌నే కాదూ… ఈ కోణాన్నీ గ‌మ‌నించాలి

daughter-in-law beats Mother-in-law for plucking Flowers at Kolkata

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సాధార‌ణంగా మ‌నం స‌మాజంలో అత్తింటి వేధింపుల గురించే మాట్లాడుతుంటాం. పెళ్ల‌యిన తొలినాళ్ల‌లోనూ, త‌ర్వాతి రోజుల్లో కొంద‌రు అత్త‌లు కోడ‌ళ్ల‌ను అనేక ర‌కాలుగా వేధిస్తుంటారు. కొన్నికొన్నిసార్లు అత్తింటి ఆర‌ళ్లు భ‌రించ‌లేక కొందరు మ‌హిళ‌లు పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తారు. భ‌ర్త‌, అత్త‌మామ‌లకు వ్య‌తిరేకంగా ఫిర్యాదుచేస్తారు. అత్తవారింట్లో బాధ‌ల నుంచి మ‌హిళ‌ల‌ను ర‌క్షించేందుకు అనేక చ‌ట్టాలు అండ‌గా ఉంటాయి. కోడ‌లి నుంచి ఫిర్యాదురాగానే అందులో నిజానిజాలు ప‌రిశీలించి భ‌ర్త‌, అత్త‌, మామ‌ల‌ను అరెస్ట్ చేస్తారు పోలీసులు. దీనివ‌ల్ల బాధితురాలైన కోడ‌లికి ఎంతో కొంత న్యాయం జ‌రుగుతుంది. ఇదే ప‌రిస్థితి అత్త‌కు ఎదుర‌యితే… న్యాయం చేసేందుకు ఎలాంటి చ‌ట్టాలు లేవు.

ఉదాహ‌ర‌ణ‌కు వ‌య‌సు మీద ప‌డిన తర్వాత కొంద‌రు మ‌హిళ‌లు కొడుకు ఇంట్లో త‌ల‌దాచుకుంటుంటారు. వృద్ధాప్యంలో ఉండే అలాంటి మ‌హిళ‌లు అత్త‌గార్ల‌యిన‌ప్ప‌టికీ వారికి ఇంట్లో ఎలాంటి ప్రాధాన్యం ఉండ‌దు. పైగా కోడ‌ళ్ల నుంచి సూటిపోటి మాట‌లూ, ఛీత్కారాలు ఎదుర‌వుతుంటాయి. ఇంకొంద‌రు కోడ‌ళ్లైతే చీటికీ మాటికీ అత్త‌ల‌పై విరుచుకుప‌డుతుంటారు. ఏ త‌ప్పూలేక‌పోయినా మాటిమాటికీ కొడుతూ ఉంటారు. అలాంటి కోడ‌ళ్ల నుంచి అత్త‌ల‌ను ర‌క్షించ‌డానికి ఎలాంటి చ‌ట్టాలూ లేవు. ఏం చేసినా అడిగేవారెవ‌రూ లేరు, ఏమీ కాదు అన్న ధైర్యంతో కొంద‌రు కోడ‌ళ్లు అత్త‌ల‌తో ఎంతో రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. అలా ఓ కోడ‌లు… వృద్ధురాలైన త‌న అత్త‌ను దారుణంగా కొడుతున్న ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

కోల్ కోతాలో ఓ కోడ‌లు అత్త‌ను కొడుతుండ‌గా ఓ నెటిజ‌న్ దాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ గొడ‌వ‌కు కార‌ణం తెలియ‌దు. కార‌ణం తెలుసుకునే వర‌కు దీన్ని షేర్ చేయండి అని కామెంట్ పెట్టాడు. ఇది వైర‌ల్ అయి కోల్ క‌తాలోని బాన్స్ ద్రోణి పోలీసుల‌కు తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు కోడ‌లు అత్త‌ను కొట్ట‌డానికి గ‌ల అస‌లు కార‌ణాన్ని వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళ్తే… ద‌క్షిణ కోల్ క‌తా ప్రాంతంలోని గ‌రియాకు చెందిన 75 ఏళ్ల జ‌శోదా పాల్ భ‌ర్త అనారోగ్యంతో చ‌నిపోవ‌డంతో కొడుకు వ‌ద్ద ఉంటోంది. ఇటీవ‌ల జ‌శోదా త‌న కోడ‌లు స్వ‌ప్న అనుమ‌తి లేకుండా వాళ్లింట్లోని పెర‌ట్లో పువ్వులు కోసింది. దీంతో ఆగ్ర‌హం చెందిన స్వ‌ప్న వృద్ధురాల‌ని కూడా చూడ‌కుండా అత్త‌ను విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టింది.

దీన్ని వీడియో తీసిన ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొన్ని గంట్ల‌లోనే 25వేల‌మంది ఆ వీడియోను షేర్ చేశారు. స్వ‌ప్న ఈ ఒక్క సంద‌ర్భంలోనే కాద‌ని, త‌న అత్త‌ను ప్ర‌తిరోజూ ఇలాగే వేధింపులకు గురిచేస్తుంద‌ని పోలీసుల విచార‌ణలో వెల్ల‌డ‌యింది. జ‌శోదాను కోడ‌లు కొడుతున్న‌ప్పుడు ఇరుగుపొరుగు వారు చోద్యంచూశారు తప్ప ఎవ‌రూ ఆమెను ర‌క్షించ‌డానికి రాలేదని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. అటు ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు స్వ‌ప్న‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని లేక‌పోతే తామే ఆ ప‌నిచేస్తామ‌ని హెచ్చ‌రించారు. స్వ‌ప్న‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.