వైఎస్ జగన్ తో కేటీఆర్ ఫెడరల్ భేటీ…పనయ్యేనా ?

ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీయేతర ఫ్రంట్ అయిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీ అధినేతలతో చర్చలు జరిపారు. అయితే ఏపీలో అధికార పక్షం కాంగ్రెస్ కూటమిలో ఉంటుందని తేటతెల్లం అయిన నేపధ్యంలో వైసీపీని తమ ఫ్రంట్ లో చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే నేడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో టీఆర్ఎస్ కీలక నేతలు చర్చలు జరపనున్నారని సమాచార అందుతోంది. ఈరోజు వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం నేడు సమావేశం కానుంది. కేసీఆర్‌ ఆదేశాల మేరకు కేటీఆర్‌, వినోద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి జగన్‌తో చర్చలు జరుపుతారు. ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, తదితర కీలక నేతలతో కేసీఆర్‌ ఇప్పటికే పలు దఫాలుగా భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఈ నేపధ్యంలోనే ఏపీ మీద ద్రుష్టి పెట్టిన కేసీఆర్ జగన్ తో భేటీకి ప్లాన్ చేశారు. అయితే గతంలో ఉన్న యూపీఏ కూటమిలోగానీ, ప్రస్తుతం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో లేని వైసీపీ అధినేత జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. గతంలో పలు సందర్భాలలో కేసీఆర్, జగన్‌ పరస్పరం ప్రశంసించుకోవడం నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌తో వైసీపీ కలిసి పనిచేయనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తాము ఏపీ రాజాకేయాల్లో వేలుపెడతామని టీఆర్ఎస్ నేతలు చెప్పడం వెనక జగన్ తరఫున ప్రచారం చేయబోవడమే కారణమని ప్రచారం జరుగుతోంది.  అయితే ఈ బృందం కేవలం ఫెడరల్ ఫ్రంట్‌పైనే చర్చిస్తారా? లేదంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా చర్చకు వస్తాయా? అన్నది తెలియాల్సి ఉంది.