క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించిన అర‌వింద‌స్వామి

Aravind Swamy Supports Kamal Hassans Words
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

త‌మిళ‌నాడులో బీజేపీకి, మోడీకి  వ్య‌తిరేకంగా బ‌ల‌మైన రాజ‌కీయ వేదిక ఏర్పాటయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పెట్ట‌బోయే కొత్త పార్టీ బీజేపీని త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా భావిస్తోంది. అందుకే క‌మ‌ల్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర‌నుంచి కేంద్రప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకునే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆ విమ‌ర్శ‌ల‌కు త‌మిళ న‌టులు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. ఇటీవ‌లే క‌మ‌ల్  విక‌ట‌న్ ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో దేశంలో హిందూ ఉగ్ర‌వాదం పెరిగిపోయిందంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. క‌మ‌ల్ ను కాల్చి చంపినా త‌ప్పులేద‌ని అఖిల భార‌తీయ హిందూ మ‌హాస‌భ ఉపాధ్య‌క్షుడు అశోక్ శ‌ర్మ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. క‌మ‌ల్ పై క్రిమిన‌ల్, ప‌రువు న‌ష్టం కేసు పెట్టాల‌న్న పిటిష‌న్ ను వార‌ణాసి కోర్టు విచార‌ణ‌కు కూడా స్వీక‌రించింది.

క‌మ‌ల్ హాస‌న్ విష‌యంలో హిందూ సంస్థ‌ల వైఖ‌రి ఇలా ఉంటే త‌మిళ‌నాడులో మాత్రం ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. క‌మ‌ల్ ఆరోప‌ణ‌ల్ని విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఇప్ప‌టికే స‌మ‌ర్థించ‌గా..తాజాగా…మ‌రో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద్ స్వామి కూడా మ‌ద్ద‌తుగా నిలిచారు. చ‌ట్ట‌విరుద్ధంగా బెదిరింపుల‌కు, హింస‌కు పాల్ప‌డే వారిని ఉగ్ర‌వాదులు కాక మ‌రేమ‌ని పిలుస్తార‌ని అర‌వింద్ స్వామి ప్ర‌శ్నించారు. ఓ త‌మిళ మేగ‌జైన్ కు రాసిన వ్యాసంలో ఆయ‌న ఈ అభిప్రాయం వ్య‌క్తంచేశారు. మెర్సల్ సినిమాకు కూడా ఆయ‌న మ‌ద్ద‌తుప‌లికారు. త‌మిళ‌నాడులో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తోంటే..రాజ‌కీయాల్లో క‌మ‌ల్ ది ఒంట‌రి పోరాటం కాద‌ని, చాలా మంది ఆయ‌న వెంట న‌డ‌వ‌నున్నార‌ని అర్ధ‌మ‌వుతోంది. కేంద్రంలో అధికారంలో ఉంటూ..ద‌క్షిణాది రాష్ట్రాల‌పై, ముఖ్యంగా త‌మిళ‌నాడుపై క‌న్నేసిన కాషాయ‌ద‌ళం ఎత్తుగ‌డ‌ల‌ను త‌న పార్టీ ద్వారా ఆదిలోనే తిప్పికొట్టాల‌ని క‌మ‌ల్ హాస‌న్ భావిస్తున్నారు. ఇత‌ర న‌టులు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు.