సంజ‌య్ ద‌త్ పాత్ర‌లో న‌టించేందుకే నేను పుట్టాను

ranbir kapoor comments on sanjay dutt biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జీవిత చ‌రిత్ర‌ల‌ను తెరపై హృద్యంగా మ‌ల్చ‌టం ఎప్ప‌టినుంచో ఉన్న‌దే. ఎంతో మంది జీవిత క‌థ‌ల ఆధారంగా బాలీవుడ్ తో పాటు అనేక భాష‌ల్లో సినిమాలు వ‌చ్చాయి. అయితే రియ‌ల్ లైఫ్ ల‌ను రీల్ లో చూపించ‌టం హిందీలోనే కాస్త ఎక్కువ‌. బ‌యోపిక్ ల‌కు అక్క‌డ స‌క్సెస్ రేటూ ఆశాజ‌న‌కంగానే ఉంటుంది. సిల్క్ స్మిత జీవితం ఆదారంగా తెర‌కెక్కిన డ‌ర్టీపిక్చ‌ర్‌, బాక్సింగ్ చాంపియ‌న్ మేరీకోమ్ బ‌యోపిక్‌, క్రికెట‌ర్ ఎంఎస్ ధోని జీవిత చ‌రిత్ర ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఇలా ఎంద‌రో రియ‌ల్ లైఫ్ ల‌ను తెర‌పై తిల‌కించిన బాలీవుడ్ ప్రేక్ష‌కులు ఇప్పుడు మ‌రో బ‌యోపిక్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అదే ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టిస్తున్న సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్‌. బాలీవుడ్ లో ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉన్న హీరోగా ఉంటూనే, ముంబ‌యి పేలుళ్ల కేసులో చిక్కుకుని ఎన్నో స‌మ‌స్య‌లనెదుర్కున్న సంజ‌య్ ద‌త్ జీవితంలో అనేక మ‌లుపులున్నాయి. సునీల్ ద‌త్‌, న‌ర్గీస్ గారాల పుత్రుడ‌యినా…ఆయ‌న జీవిత‌మంతా మ‌ళ్ల‌బాట‌లానే సాగింది. ఆయ‌న వైవాహిక జీవిత‌మూ ఎన్నో ఒడిదుడుకుల‌కు లోన‌యింది. వీట‌న్నింటిని తెర‌పై క‌ళ్ల‌కుక‌ట్టిన‌ట్టు చూపించ‌నున్నారు రాజ‌కుమార్ హిర్వాణి. క‌ష్ట‌కాలంలో సంజ‌య్ ద‌త్ కు మున్నాభాయ్ ఎంబీబీఎస్‌, ల‌గేర‌హో మున్నాభాయ్ వంటి హిట్లిచ్చి అండ‌గా నిలిచిన హిర్వాణి ఇప్పుడు ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను వెండితెరపై ఆవిష్క‌రిస్తున్నారు.

సినిమాలో సంజ‌య్ ద‌త్ గా న‌టిస్తున్న ర‌ణ‌బీర్ క‌పూర్ పాత్ర‌లో జీవించేస్తున్నాడ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ పాత్ర త‌న‌కు ద‌క్క‌టంపై ర‌ణ‌బీర్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ చిత్రంలో న‌టించ‌టానికే తాను పుట్టానంటున్నాడు ర‌ణ‌బీర్‌. త‌న అల్మ‌రాలో ఉన్న ఏకైక హీరో ఫొటో సంజ‌య్ దే అన్న ర‌ణ‌బీర్ ఒక‌రి పాత్ర‌లో న‌టించేట‌ప్పుడు వారిలా దేహ‌దారుఢ్యాన్ని పెంచుకోగ‌లం కానీ, వారికున్న మ‌న‌స్త‌త్వం అల‌వర్చుకోలేమ‌ని చెప్పారు. ఈ సినిమా కోసం తాను చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని, ప్రేక్ష‌కులకు కూడా ఈ బ‌యోపిక్ ద్వారా సంజ‌య్ అంటే ఏంటో తెలుస్తుంద‌ని ర‌ణ‌బీర్ అన్నారు. సంజ‌య్ ద‌త్ రోజూ సెట్స్ కి వ‌స్తూ…తన ఎదురుగానే కూర్చుని ఎలా న‌టించాలో త‌నకు చెబ్తున్నార‌ని. అందుకే పాత్ర‌లో ప‌రకాయ ప్ర‌వేశం చేయ‌గ‌లుగుతున్నాన‌ని ర‌ణ‌బీర్ అన్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బ‌యోపిక్ వ‌చ్చే ఏడాది మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు:

ఆనందో బ్రహ్మ… తెలుగు బులెట్ రివ్యూ.

మహేష్‌కు ఎందుకంత టెన్షన్‌?