హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ గోడ కూలి ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మహానగరంలోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి అడ్డగుట్ట కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలింది. ఆ భవనం గోడ కూలడంతో ఏకంగా ముగ్గురు మృతి చెందారు.
ఐదవ అంతస్తు గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ముగ్గురు మరణించగా మరో ఇద్దరికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత మూడు రోజులుగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెర్పు లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలోనే గోడ తడిసి కూలిపోయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.