బకెట్లల్లో 1,755 మానవ శరీర భాగాలు, తలలు !

1755-human-body-parts-and-heads-in-buckets

అమెరికాలోని అరిజోనలో గల బయోలాజికల్ రిసోర్స్ సెంటర్(BRC) శవాలపై పరిశోధనలు నిర్వహిస్తోంది. చనిపోయిన తర్వాత పరిశోధనలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అమెరికాలోని చాలామంది ఈ కేంద్రానికి తమ ఆప్తుల శవాలను అప్పగించేవారు. అయితే, అక్కడ జరిగింది వేరు. శవాలకు కనీసం గౌరవం ఇవ్వకుండా జంతువులు కంటే దారుణంగా ముక్కలు చేసి ఆ భాగాలను బకెట్లు, సంచుల్లో వేసేవారు. కొన్ని భాగాలను తాళ్లు కట్టి వేలాడదీసేవారు. ఈ కేంద్రానికి తమ ఆప్తుల శవాలను దానమిచ్చిన 33 మంది బీఆర్సీపై ఇటీవల దావా దాఖలు చేశారు.

అవయవ దానానికి లేదా వ్యాధులపై పరిశోధనల కోసం మృత శరీరాలను ఉపయోగిస్తామని నమ్మబలికి తమ ఆప్తుల శవాలను సేకరించారని పేర్కొన్నారు. వాస్తవానికి ఆ శవాలను అక్రమంగా విక్రయించి, అసాంఘిక చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఇందుకు 2015లో వెలుగు చూసిన ఘటనే నిదర్శనమని తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శవాలతో అక్రమ వ్యాపారం చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో 2015లో బీఆర్సీ యజమాని స్టిఫెన్ గోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడి ప్రొబేషన్ ఈ ఏడాదితో ముగియున్న నేపథ్యంలో బాధిత కుటుంబికులు ఆ సంస్థపై దావా వేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ ఘటన మరోసారి సంచలనంగా మారింది. ఆ కేంద్రంలో శవాలతో ప్రయోగాలు కంటే పిచ్చి పనులే ఎక్కువ చేసేవారని అధికారి తెలిపారు. ఓ మహిళ శవం నుంచి తలను తొలగించి.. పురుషుడి మొండానికి పెట్టి కుట్లు వేశారని, ఆ శరీరాన్ని హర్రర్ సినిమాల్లో చూపినట్లుగా గోడకు వేలాడ దీశారని అన్నారు. ఈ కేంద్రంలోని ఓ కూలర్‌లో వందల సంఖ్యలో కత్తిరించిన పురుషాంగాలు, ఇన్ఫెక్షన్ సోకిన తలలను పడేశారన్నారు.