వామ్మో ఎస్ఐ బైకునే కొట్టేశాడుగా !

si-bike-was-stolen

ప్రజలకు వస్తువుల చోరీకి గురైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మరి పోలీసుల వస్తువులనే దొంగలు కొట్టేస్తే ఏం చేస్తారు. ఏం చేస్తారు వాళ్లు కూడా పోలీసులనే ఆశ్రయిస్తారు. ఇదే విధంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పోలీసు తన బైక్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చిత్తూరు నగరంలోని ఉషానగర్‌లో ఉండే రఘు స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన బైక్ బయట పార్క్ చేసి గదిలో నిద్రపోయారు. గురువారం నిద్రలేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో ఆయన క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్ఐ బైకే చోరీకి గురికావడం చిత్తూరులో కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటంతో చిత్తూరులో దొంగతనాలు పెరిగిపోయాయని, ఇప్పుడు దొంగలు ఏకంగా పోలీసులనే టార్గెట్ చేశారని స్థానికులు అంటున్నారు. మరోవైపు తమ బైకే దొంగిలించి పోలీసుశాఖ పరువు తీసిన దొంగ దొరికితే ఇరగదీసేందుకు చిత్తూరు పోలీసులు లాఠీలు పట్టుకుని ఎదురుచూస్తున్నారు.