ఆర్మీ భారీ రిక్రూట్మెంట్. కానీ…

ఆర్మీలో యువ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన సైనికులుగా చేర్చుకునే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తోంది ఆర్మీ. యుద్ధ పోరాట దళాలుతో పాటు పలు విభాగాల్లో ఆఫీసర్, ఇతర హోదాల్లో మూడేళ్ల కాలపరిమితితో వారిని చేర్చుకోవాలనే విషయంపై దృష్టి సారించింది. యువకులకు సైనిక జీవితాన్ని పరిచయం చేయడంతో పాటు సైన్యాన్ని ప్రజలకు దగ్గర చేసే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను రూపొందించారు. అయితే ‘ఎంపిక ప్రక్రియలో మాత్రం ఎలాంటి వెసులుబాటు ఉండదు. రెగ్యులర్‌ సెలక్షన్‌ వలెనే ఉంటుంది.

మొదట దశలో ప్రయోగాత్మకంగా 100 మంది అధికారులు, వెయ్యిమంది సైనిక సిబ్బందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ముందుగా ఈ ప్రతిపాదనకు ఉన్నతస్థాయిలో ఆమోదం లభించాల్సి ఉంది’ అని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్‌ అమన్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’ లేదా ‘త్రీ ఇయర్‌ షార్ట్‌ సర్వీస్‌’ రిక్రూట్‌మెంట్‌ కార్యక్రమంలో ఏ వయసు వారిని పరిగణనలోకి తీసుకోవాలి? ఫిట్‌నెస్‌ స్థాయిలు ఎలా ఉండాలి? వంటి కీలక అంశాలపై కసరత్తు సాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం జాతీయ వాదం, దేశభక్తి ప్రజ్వరిల్లుతున్న ఈ సమయంలో… పూర్తిస్థాయిలో కాకుండా.. తాత్కాలికంగా సైన్యంలో చేరాలనుకుంటున్న యువకులే టార్గెట్ గా ఈ పథకం రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా అతి త్వరలో ఆర్మీ ఉన్నతస్థాయి కమాండర్లు పాల్గొనే ఒక కార్యక్రమంలో దీనిపై లోతుగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌లో రిక్రూట్‌ చేసుకున్న వారికి గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ లాంటి సౌకర్యాలేవీ ఉండవు కనుక ఆర్థికంగా ఇది లాభదాయకమని ఆర్మీ భావిస్తోంది. పారామిలటరీ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల(సీఏపీఎఫ్‌) నుంచి ఆసక్తి ఉన్నవారిని ఏడేళ్ల కాలపరిమితిలో సైన్యంలో చేర్చుకునే ప్రతిపాదనపై చర్చ నడుస్తోంది. తర్వాత∙వారు పాత సర్వీస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం పదేళ్ల కాలపరిమితితో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కింద యువతను ఆర్మీ రిక్రూట్‌ చేసుకుంటోంది. ఆ కాలపరిమితిని 14 ఏళ్ల వరకు పెంచవచ్చే టాక్ నడుస్తోంది.