నా పేరు సూర్య కోసం బాహుబలి?

baahubali star prabhas coming for naa peru surya pre release event

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుపుకుంటుంది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుతో పాటు పలు ఇండియన్‌ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇండియా మొత్తం తెలిసే విధంగా ప్రమోషన్‌ చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను ఈనెల చివరి వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలో బాహుబలి ప్రభాస్‌ పాల్గొంటాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రం షూటింగ్‌ నిమిత్తం దుబాయిలో ఉన్నాడు. అక్కడ చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత ఈనెల చివర్లో ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలోనే ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్‌కు అల్లు అర్జున్‌కు మంచి సన్నిహిత సంబంధం ఉంది. దాంతో పాటు దర్శకుడు వక్కంతం వంశీ కూడా ప్రభాస్‌కు ఆప్తుడు. అందుకే వారిద్దరి కోసం ప్రభాస్‌ ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొనేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. గతంలో ఏ ఆర్మీ చిత్రంలో చూపించని కొన్ని ఆసక్తికర సీన్స్‌ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.