కారు ఢీకొనడంతో ఒకరు మృతి

కారు ఢీకొనడంతో ఒకరు మృతి

బైకును వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పాతకక్షల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే బైకును కారుతో ఢీకొట్టి హత్య చేశారని క్షతగాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలకలం సృష్టించిన ఈ ఘటన తాండూరు పట్టణంలో యాలాల ఠాణా పరిధిలోకి వచ్చే రాజీవ్‌ కాలనీ వద్ద శనివారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ సురేష్‌ కథనం ప్రకారం.. రాజీవ్‌ కాలనీకి చెందిన జబ్బార్‌(35)ఆటో డ్రైవర్‌. శనివారం రాత్రి 11 గంటలకు అతడు అదే కాలనీకి చెందిన సూఫియాన్, సోహైల్‌తో కలిసి బైక్‌పై తాండూరు నుంచి కాలనీ వైపు వస్తున్నాడు.

ఈక్రమంలో కాలనీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో జబ్బార్‌ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సూఫియాన్, సొహైల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సూఫియాన్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు హైదరాబాద్‌ తీసుకెళ్లారు.ఈ ఘటనను మొదట స్థానికులు ప్రమాదంగా భావించారు.

కారు ఢీకొన్న తర్వాత అందులోని వ్యక్తులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సూఫియాన్‌.. పాతకక్షల నేపథ్యంలో ఇస్మాయిల్, మోహిన్‌ అనే వ్యక్తులు కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నించారని ఆరోపించారు. అనంతరం యాలాల పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్‌సీఐ జలంధర్‌రెడ్డి వివరాలు సేకరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడు జబ్బార్‌కు భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.