ఫ్లోరిడాలో కూలిన భవనం

ఫ్లోరిడాలో కూలిన భవనం

అమెరికాలోని ఫ్లోరిడాలో గురువారం 12 అంతస్తుల భవనం కూలిన ఘటనలో భారత సంతతికి చెందిన అమెరికన్ దంపతులు, వారి ఏడాది చిన్నారి సహా 150 మందికిపైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 9 మంది మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటించారు. గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

భారతీయ దంపతులు విశాల్ పటేల్ (42), ఆయన భార్య భావనా పటేల్ (38), వారి ఏడాది పాప ఐషని పటేల్ ఆచూకీ గల్లంతయినట్టు వారి బంధువు సరినా పటేల్ చెప్పారు. భావనా పటేల్ ప్రస్తుతం నాలుగో నెల గర్భవతి కాగా… కుటుంబసభ్యులతో చివరిసారిగా ఫాదర్స్ డే రోజున మాట్లాడినట్టు సరినా తెలిపారు.

‘నిన్ను చూడాలని ఉంది.. కుమార్తెను చూసి వెళ్లాలని భావన కోరింది.. దీంతో నేను విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాను.. ఈ విషయం వారికి చెప్పాలని ఫోన్ చేశాను’ అని చెప్పింది. భవనం కూలిపోయిన సమయంలో వారు ఇంట్లోనే ఉన్నారని తెలిపింది. చాలాసార్లు ఫోన్ చేసినా సమాధానం రాలేదని, మెసేజ్‌లకు స్పందించలేదని పేర్కొన్నారు.

చాలా మంచి కుటుంబమని, వారి పాప కుందనపు బొమ్మలా ఉంటుందని విశాల్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉమా కన్నయన్ అన్నారు. శిథిలాల నుంచి తమవారు ప్రాణాలతో బయట పడతారా అని బంధువులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు. మరికొన్ని రోజులైనా సహాయక చార్యులు కొనసాగుతాయని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు శిథిలాల్లో ఇరుక్కుని గాయపడిన 11 మందిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మియామీలో గురువారం తెల్లవారుజామున ప‌న్నెండు అంతస్తుల భవనంలో కొంతభాగం కుప్పకూలింది. చాంప్లైన్ ట‌వ‌ర్స్‌ పేరిట పిలిచే ఈ బ‌హుళా అంత‌స్తుల భ‌వ‌నంలోని దాదాపు సగం 130 యూనిట్లు కుప్పకూలిన‌ట్లు ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ చీఫ్ రే జ‌డ‌ల్హా వెల్లడించారు.