చేతులు ముడుచుకుని కూర్చోను

చేతులు ముడుచుకుని కూర్చోను

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలై.. డీఎంకే ఘన విజయానికి సాధించి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. కాగా, అన్నాడీఎంకే ఓటమిపై జయలలిత నెచ్చెలి, ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారులతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఆడియో వెలుగులోకి వచ్చాయి. అందరం కలిసి ఐకమత్యంలో పనిచేద్దామని తాను చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడం వల్లే అన్నాడీఎంకే ఓటమిపాలైందని శశికళ చెబుతున్నట్టు ఆ ఆడియోలో ఉంది.

బెంగళూరు జైలు నుంచి విడుదలై తమిళనాడుకు బయల్దేరినప్పుడే కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చానని ఆమె గుర్తుచేశారు. అయితే తన మాటలను పార్టీ నేతలు పెడచెవిన పెట్టారని ఆమె విమర్శించారు. వారి వల్లే ఈరోజు అమ్మ ప్రభుత్వం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ప్రతి ఊరి నుంచి కార్యకర్తలు వారి వేదనను తనతో పంచుకుంటున్నారని తెలిపారు. ఎంతో కష్టపడి అన్నాడీఎంకేని ఈ స్థాయికి తీసుకొచ్చామని… ఇకపై చేతులు ముడుచుకుని కూర్చోలేమని శశికళ స్పష్టం చేశారు. కార్యకర్తలతో కలిసి పని చేస్తానని కుండబద్దలుకొట్టారు.

అలాగే, థేనీకి చెందిన ఓ మద్దతుదారుడితో జరిగిన ఫోన్ సంభాషణలో శశికళ మాట్లాడుతూ.. 18 మంది ఎమ్మెల్యేలను అనవసరంగా అనర్హులుగా ప్రకటించి అన్నాడీఎంకే నాయకత్వం పెద్ద తప్పు చేసిందని అన్నారు. అనర్హులైన 18 మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ‘అమ్మ (జయలలిత) అనారోగ్యంతో ఉన్నప్పుడు పార్టీ తీవ్రంగా పోరాడి సీట్లు గెలుచుకుంది.. ఆ వాస్తవాన్ని మరచిపోయి అనర్హులుగా ప్రకటించడం పెద్ద తప్పు’ అని అన్నారు.

నిర్ణయం తీసుకునే ముందు సాధారణ కారణం, పార్టీ శ్రేయస్సును గమనించడంలో అన్నాడీఎంకే నాయకత్వం విఫలమైందని ఆరోపించారు. పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని, దీని ప్రభావం ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి కారణమయ్యిందని దుయ్యబట్టారు. జయలలిత చేసిన విధంగా పార్టీని నడిపిస్తానని, క్రమశిక్షణను కొనసాగిస్తానని శశికళ చెప్పారు. క్రమశిక్షణ కొనసాగిస్తే పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేదని శశికళ అభిప్రాయపడ్డారు.

పార్టీ క్యాడర్‌ పట్ల ప్రస్తుత నాయకత్వం సవతి తల్లి మాదిరిగా వ్యవహరిస్తోందని, అన్నాడీఎంకేలోని 1.5 కోట్ల కుటుంబాలకు రక్షణగా ఉంటానని హామీ ఇచ్చారు. పేదలు, అవసరమైనవారికి దివంగత ముఖ్యమంత్రి జయలలిత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడం తన బాధ్యతని ఉద్ఘాటించారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత జిల్లాల్లో పర్యటించాలని శశికళ భావిస్తున్నారు.