ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

మహారాష్ట్రలో హైడ్రామా కొనసాగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ్‌ రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కొంకణ్‌లో జన్‌ఆశీర్వాద్‌ ర్యాలీలో పాల్గొన్న రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది ముందే గ్రహించి రత్నగిరి కోర్టులో నారాయణ్‌ రాణే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా అది రద్దయ్యింది.

బెయిల్‌ పిటిషన్‌ రద్దయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. దీంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.అంతకుముందే రాణేను అరెస్ట్‌ చేస్తున్నట్లు నాసిక్‌ కమిషనర్‌ పాండే ప్రకటించారు. అయితే అరెస్ట్‌ నేపథ్యంలోముంబై హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేయగా నారాయణ్‌ రాణేకు చుక్కెదురైంది. అత్యవసరంగా పిటిషన్‌ విచారించలేమని ముంబై హైకోర్టు తెలిపింది. కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణేపై వేర్వేరు ప్రాంతాల్లో 4 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం వాటిపై విచారణ కొనసాగుతోంది.