సుష్మ కి కాంగ్రెస్ సపోర్ట్ !

congress supports sushma swaraj

ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న హిందూ యువతికి పాస్‌పోర్ట్ ఇచ్చేలా అధికారులను ఆదేశించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హిందూవాదులకి టార్గెట్ మారారు. తాను పాస్‌పోర్ట్ కోసం లఖ్నౌ పాస్‌పోర్ట్ కార్యాలయం వెళ్లగా వికాస్ మిశ్రా అనే అధికారి మతం ఆధారంగా తన పట్ల వివక్ష చూపారంటూ తన్వీ సేఠ్ ట్విటర్‌లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో, మీడియాలో పెద్ద చర్చే జరిగింది. లఖ్నౌలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి ఒకరు తమను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని నోయిడాకు చెందిన ఈ జంట ఆరోపించింది. 

తనను మతం మార్చుకోవాలని, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఆ అధికారి తనతో అన్నట్టు తన్వీ భర్త అనస్ సిద్దిఖీ మీడియాకు చెప్పారు. ఆ తర్వాత మంత్రి ఆదేశాలతో తక్షణం చర్యలు తీసుకుంటూ అధికారులు వారికి పాస్‌పోర్టులు మంజూరు చేశారు. పాస్‌పోర్ట్ కార్యాలయం తమకు పాస్‌పోర్ట్‌లు జారీ చేసిందంటూ సుష్మా స్వరాజ్‌ను ట్యాగ్ చేస్తూ తన్వీ ట్వీట్ చేశారు. ఇలాంటి అనుభవం మరెవ్వరికీ ఎదురు కాగూడదని ఆమె తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. 

ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు అతణ్ని బదిలీ చేసి, సదరు జంటకు పాస్‌పోర్టు జారీ చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా సుష్మాపై కొంత మంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సుష్మాను విమర్శిస్తున్నవారిలో సొంత పార్టీకి చెందినవారు కూడా ఉండటం గమనార్హం. తనపై విమర్శలు కురిపిస్తున్నవారికి కూడా సుష్మా సున్నితంగా బదులిస్తూ రీట్వీట్ చేశారు. తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్‌ స్పందించింది. ‘పరిస్థితులు, కారణాలు ఎలాంటివైనా కావొచ్చు. బెదిరింపులు, హింస, ఒకరిని అగౌరవపరిచేవిధంగా దూషించడం ఎంతమాత్రం సరికాదు. ఈ విషయంలో సుష్మాను నిందించడానికి, అగౌరవపరచడానికి ఎలాంటి అస్కారం లేదు. ఈ అంశంలో మేం సుష్మా నిర్ణయానికి మద్దతు పలుకుతున్నాం. ఆమె చర్యను మేం అభినందిస్తున్నాం’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.