మెడికల్‌ కాలేజీలో కరోనా

మెడికల్‌ కాలేజీలో కరోనా

కర్ణాటకలోని ధార్వాడ్‌ మెడికల్‌ కాలేజీలో 66 మంది విద్యార్థులు గురువారం కరోనా బారినపడినన విషయం తెలిసిందే. తాజాగా, ఈ సంఖ్య 182కు చేరడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ధార్వాడ్ మెడికల్ కాలేజీ కోవిడ్ క్లస్టర్‌గా మారిపోయింది. వీరిలో మెజార్టీ సంఖ్య టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం గమనార్హం.

ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో మొత్తం 400 మంది విద్యార్థుల్లో గురువారం 300 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నవంబరు 17న కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో వీరంతా పాల్గొన్నారు. ఆ సమయంలో వారికి వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

అలాగే, బాధితుల నమూనాలను జన్యు పరీక్షలకు పంపనున్నట్టు ఆరోగ్య శాఖ కమిషనర్ రణదీప్ తెలిపారు. ‘విద్యార్థులంతా పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు.. ఇంత పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడటానికి కొత్త వేరియంట్ కారణమా? అనే అనుమానంతో జన్యు పరీక్షలకు కొద్ది మంది రక్త నమూనాలను పంపుతాం’ అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాలేజీలోని రెండు హాస్టళ్లను సీల్ చేసి, ఎవరినీ బయటకు వెళ్లకుండా చేశారు. అక్కడ విద్యార్థులంతా టీకాలు తీసుకోవడంతో వారిని క్వారెంటైన్‌లో ఉంచినట్లు ధార్వాడ్‌ డిప్యూటీ కమిషనర్‌ నితేష్‌ పాటిల్‌ తెలిపారు. స్వల్ప, ఎటువంటి లక్షణాలు లేని విద్యార్థులకు క్యాంపస్‌లో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా కోవిడ్ బారినపడటంతో ప్రైమరీ, సెకెండరీ కాంటాక్టలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరింత మంది కోవిడ్ బారినపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, కాలేజీలోని దాదాపు 3,000 వరకు ఉన్న విద్యార్థులు, సిబ్బంది అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకూ కనీసం 1,000 మందికి నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. వారి ఫలితాలు రావాల్సి ఉంది.

‘‘మిగతా 100 మందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం.. రెండు హాస్టళ్లను సీల్‌ చేశాం.. విద్యార్థులకు అవసరమైన చికిత్స, ఆహారాన్ని అందిస్తున్నాం.. ఎవరినీ బయటకు వెళ్లనీయడం లేదు.. ఇప్పటికీ పరీక్షలు చేయించుకోని విద్యార్థులను వేరే చోట క్వారెంటైన్‌లో ఉంచాం.. కాలేజీ ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు అందరినీ పరీక్షించాం… ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించేపనిలో ఉన్నాం’’ అని పాటిల్‌ పేర్కొన్నారు.

కోవిడ్ నిర్దారణ అయిన కొంత మంది విద్యార్థులకు జలుబు, జ్వరం వంటి లక్షణాలు బయటపడగా.. కొందరికి ఎటువంటి లక్షణాలు లేవన్నారు.గత కొన్ని వారాలుగా కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతూ ఉన్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 306 కేసులు బయటపడగా.. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.36 శాతంగా ఉంది.