యాపిల్ ఉత్పత్తులకు మంచి క్రేజ్

యాపిల్ ఉత్పత్తులకు మంచి క్రేజ్

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సంస్థ ఉత్పత్తులకు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఐఫోన్లు, మ్యాక్ కంప్యూటర్లు అధిక సంఖ్యలో అమ్ముడవుతుంటాయి. ఇక ఐఫోన్ కొత్త మోడల్ విడుదలైందంటే సందడి మామూలుగా ఉండదు. త్వరగా ఆ మొబైల్ చేజిక్కించుకోవాలని టెక్ ప్రియులు తహతహలాడుతుంటారు. అయితే యాపిల్ ప్రొడక్టులు వాడే వారికి రిపేర్ వస్తే పెద్ద సమస్యగా ఉంటోంది. ఎందుకంటే కచ్చితంగా యాపిల్ సర్వీస్ సెంటర్లలోనే రిపేర్ చేయించుకోవాలి. అయితే దానికి పరిష్కారం తీసుకొచ్చింది యాపిల్. త్వరలో సెల్ఫ్ సర్వీస్ రిపేర్ ప్రోగ్రామ్ అతి త్వరలో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఆ సంస్థ తీసుకున్న నిర్ణయంతో యాపిల్ యూజర్లకు పెద్ద ఊరట లభించనుంది.

ఐఫోన్లు, మ్యాక్ ల్యాప్‌టాప్‌లకు స్పేర్ పార్ట్స్, టూల్స్ ఇక నుంచి సాధారణ ప్రజలకు కూడా విక్రయిస్తామని యాపిల్ ప్రకటించింది. వీటితో వచ్చే మాన్యువల్స్ ను అనుసరించి ప్రజలు స్వయంగా కూడా రిపేర్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇలా స్పేర్ పార్ట్స్ అమ్మేందుకు యాపిల్ సిద్ధం కావడం చరిత్రలో ఇదే తొలిసారి.ఎంతో మంది వినియోగదారులు ఎన్నో సంవత్సరాలు ఒత్తిళ్లు పెట్టిన తర్వాత యాపిల్ ఈ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ ప్రోగ్రామ్ కు నిర్ణయించింది. కంపెనీ స్పేర్ పార్ట్స్, మాన్యువల్స్ యూజర్లకు అమ్మేందుకు సిద్ధమైంది. దీనిద్వారా యూజర్లు స్వయంగా రిపేరీ చేసుకోగలరు.. లేకపోతే బయట మొబైల్ షాపుల్లోనైనా చేయించుకోగరు.

దీని ద్వారా యాపిల్ సర్వీస్ సెంటర్లు వేసే భారీ సర్వీస్ చార్జ్ నుంచి కాస్త ఉపశమనం లభించినట్టే ఉంటుంది.సెల్ఫ్ సర్వీస్ ప్రోగ్రామ్ కింద యాపిల్ కస్టమర్లు కావాల్సిన స్పేర్ పార్ట్స్ ను కొనుగోలు చేసి మాన్యువల్ ప్రకారం రిపేర్ చేసుకోవచ్చు. దీని కోసం కస్టమర్లకు 200 వరకు స్పేర్ పార్ట్స్, టూల్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు యాపిల్ చెప్పింది. ఐఫోన్ 12, ఐఫోన్ 13కు సంబంధించిన బ్యాటరీలు, డిస్ప్లేలు, కెమెరాలు లాంటివి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.

అలాగే త్వరలోనే మాక్ కంప్యూటర్లకు కూడా సెల్ఫ్ సర్వీస్ ప్రోగ్రామ్ తీసుకురానుంది యాపిల్. సాధారణ రిపేర్లు యూజర్లే చేసుకునేలా స్పేర్ పార్ట్స్ అందుబాటులోకి తేనుంది.యాపిల్ కాకుండా ఇతర రిపేర్ షాప్ లు స్పేర్ పార్ట్స్, టూల్స్ కొనేలా గతంలోనే ఓ కార్యక్రమం ప్రారంభించింది యాపిల్. మొత్తంగా 2800 ఇండిపెండెంట్ షాప్ లు ఈ ప్రోగ్రాంలో ఉన్నాయి. అలాగే కస్టమర్లు తాము వినియోగించిన స్పేర్ పార్ట్స్ ను ఇండిపెండెంట్ షాపుల్లో ఇస్తే కొత్త పార్ట్స్ పై డిస్కౌంట్ కూడా ఇవ్వనుంది యాపిల్.

యూజర్లకు స్పేర్ పార్ట్స్ అమ్మే సెల్ఫ్ సర్వీస్ ప్రోగ్రాం వచ్చే సంవత్సరం మొదట్లో ప్రారంభం అవుతుందని యాపిల్ వెల్లడించింది. మొదట అమెరికాలో ఇది మొదలుకానుండగా.. వచ్చే ఏడాది చివరి కల్లా మరిన్ని దేశాల్లో ప్రారంభించాలని యాపిల్ ప్లాన్ చేస్తోంది.