స్వీట్ మెమొరీస్ లో క్రికెట్ గాడ్…

తాజాగా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్న సచిన్‌ ఆ పిక్ తో అందరి దృష్టిని మరల్చాడు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు, తన సహచర ఆటగాడు సౌరవ్‌ గంగూలీతో సచిన్‌కు ఉన్న సాన్నిహిత్యం అంతా ఇంతా కాదు. వీరిద్దరూ సహచర క్రికెటర్లు అనటం కన్నా గొప్ప స్నేహితులు అంటుంటారు క్రీడా విశ్లేషకులు. ఎన్ని రికార్డులు సాధించినా.. ఎంత పెద్ద పదవులు అదిరోహించినా వీరిమధ్య ఉన్న స్నేహం ఏమాత్రం చెక్కుచెదర్లేదు.

బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉండి కూడా దాదా అనేకమార్లు సచిన్‌పై ఛలోక్తులు విసిరారు. అదేవిధంగా సచిన్‌ కూడా అప్పుడప్పుడూ సరదాగా కౌంటర్‌ ఇచ్చేవాడు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు సచిన్‌. తన సహచర క్రికెటర్లతో సరదగా గడిపిన పాత మధురమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తున్నాడు సచిన్.

అందులో భాగంగా తాజాగా గంగూలీ ఇంట్లో ఓ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను సచిన్‌ షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కేవలం కొన్ని గంటల్లోనే ఏకంగా వన్‌ మిలియన్‌ లైక్స్‌ ఈ ఫోటో సాధించిన ఘనత. అంతేకాకుండా వీరిద్దరి స్నేహం, గొప్పతనంపై నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో ‘దాదాతో క్రికెట్‌ గాడ్’ అంటూ ఓ అభిమాని కామెంట్‌ చేయడం విశేషం.