తల్లి ప్రాణం తీసిన క్రికెట్ గొడవ

తల్లి ప్రాణం తీసిన క్రికెట్ గొడవ

తనయుడి క్రికెట్‌ గొడవ ఓ తల్లి ప్రాణాన్ని తీసింది. కుటుంబమంతా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అవినాశి సమీపంలో గణేషపురం, మడత్తు పాళయంకు ఆదివారం క్రికెట్‌ పోటీ జరిగాయి. లాక్‌ డౌన్‌నిబంధల్ని ఉల్లంఘించి క్రికెట్‌ ఆడటమే కాదు, రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఇందులో జీవా అనే యువకుడ్ని ప్రత్యర్థి నలుగురు యువకులు చితక్కొట్టారు. సాయంత్రం ఇంటికి వచ్చిన జీవాను రక్తగాయాలతో చూసిన తల్లిదండ్రులు మునుస్వామి, కొండమ్మాల్‌లు ఆందోళన చెందారు. ఆ యువకుల్ని నిలదీయడానికి వారి ఇంటి వద్దకే రాత్రి సమయంలో తల్లిదండ్రులు, జీవా, అతడి సోదరుడు శివాలు వెళ్లారు.

ఆగ్రహించిన ఆ యువకులు వీరిపై కూడా దాడికి దిగారు. ఈ దాడిలో మునుస్వామి, కొండమ్మాల్, జీవా, శివ గాయపడ్డారు.కొండమ్మాల్‌ తల మీద బలమైన గాయం కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె మార్గం మధ్యలో మరణించింది. మిగిలిన ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రికెట్‌ గొడవ విషయంగా ప్రశ్నించేందుకు వెళ్లిన కొండమ్మాల్‌ను హతమార్చడమే కాకుండా, మిగిలిన ముగ్గురి మీద హత్యాయత్నం చేశారంటూ మడత్తు పాళయంకు చెందిన కుమార్, రాజ, వరదన్, తంగరాజ్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.