కరోనా ఔషధాన్ని చేస్తున్న చైనీస్‌ లాబొరేటరీ శాస్త్రవేత్తలు

కరోనా ఔషధాన్ని చేస్తున్న చైనీస్‌ లాబొరేటరీ శాస్త్రవేత్తలు

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తాము ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చైనీస్‌ లాబొరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాము తయారుచేసిన డ్రగ్‌ను వాడినట్లయితే కరోనా పేషెంట్లు త్వరగా కోలుకోవడమే గాకుండా.. వారి రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుందని పేర్కొన్నారు. జంతువులపై ఈ మేరకు తాము చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు. చైనాలోని ప్రతిష్టాత్మక పెకింగ్‌ యూనివర్సిటీలో ఈ డ్రగ్‌ను పరీక్షించినట్లు వెల్లడించారు. కాగా ప్రాణాంతక కోవిడ్‌-19 బారి నుంచి మానవాళిని కాపాడేందుకు ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే పనిలో తలమునకలైన విషయం తెలిసిందే. విశ్వమారి పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనాలో కూడా ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో ద్రవరూపంలో కాకుండా టాబ్లెట్‌ రూపంలో కోవిడ్‌కు మందు కనిపెట్టేందుకు పలువురు చైనీస్‌ పరిశోధకులు ముందుకువచ్చారు. ఈ విషయం గురించి బీజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఫర్‌ జెనోమిక్స్‌ డైరెక్టర్‌ సన్నీ షీ మాట్లాడుతూ.. జంతువులపై తాము చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని తెలిపారు. ‘‘ రోగం బారిన పడిన ఎలుకలకు న్యూట్రలైజింగ్‌ యాంటీ బాడీస్‌ ఎక్కించాం. ఐదు రోజుల తర్వాత దానిలో వైరస్‌ ప్రభావం 2500 యూనిట్లకు పడిపోయింది. కాబట్టి ఈ డ్రగ్‌ను కరోనా చికిత్స విధానంలో ఉపయోగించుకోవచ్చు’’అని పేర్కొన్నారు.

కాగా కరోనా బారిన పడి కోలుకున్న 60 మంది పేషెంట్ల నుంచి యాంటీబాడీలు సేకరించామని.. వాటి ఆధారంగా డ్రగ్‌ను అభివృద్ధి చేశామని సన్నీ తెలిపారు. క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపి.. వచ్చే ఏడాది వరకు దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు న్యూట్రలైజ్‌డ్‌ యాంటీబాడీస్‌ ప్రత్యేకమైన డ్రగ్‌లా ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. ప్లాస్మా విధానంతో చాలా మంది పేషెంట్లు కోలుకుంటున్నారని.. అయితే పెద్ద మొత్తంలో ప్లాస్మా అందుబాటులో లేనందున డ్రగ్‌ వాడకం ఉపయోగకరంగా ఉంటుందని సన్నీ తెలిపారు. ప్రభావంతమైన ఔషధాన్ని తయారు చేయడం ద్వారా వ్యాక్సిన్‌ లేకుండానే విశ్వమారిని కట్టడి చేయవచ్చన్నారు.