దేవ్ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

Dev Movie Review & Rating

అన్నచాటు తమ్ముడిగా తమిళ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తి నెమ్మదిగా తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి వైవిధ్యమైన కథలను చేస్తూ వాటిలో కొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినా కార్తికి మాత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. జయాపజయాలను పట్టించుకోకుండా ప్రయోగాలకు పెద్దపీట వేసే కార్తి ఈ వాలంటైన్స్ డే రోజున ‘దేవ్’ అనే అడ్వంచర్ రొమాంటిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో రజత్ రవిశంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తొలి సినిమానే అడ్వంచర్, లవ్‌ను మిక్స్ చేసి రజత్ అందించిన ప్రయోగం ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూద్దాం.

కధ :

దేవ్ (కార్తి) వ్యాపారవేత్త రామలింగం (ప్రకాశ్ రాజ్) కొడుకు. కానీ అతనికి ఈ వ్యాపారం, డబ్బు సంపాదనపై ఆసక్తి ఉండదు. జీవితం చాలా అడ్వంజరస్‌గా ఉండాలని అనుకుంటూ బతుకుతాడు. ఇతని అడ్వంచర్ లైఫ్‌లోకి ప్రాణ స్నేహితులు విఘ్నేష్ (ఆర్జే విఘ్నేష్‌కాంత్), నిషా (అమృత శ్రీనివాసన్)ను కూడా లాగుతుంటాడు. దేవ్‌ను ఎలా అయినా తమ నుంచి దూరం చేయాలని విఘ్నేష్ ఒక ప్లాన్ వేస్తాడు. ఫేస్‌బుక్ ద్వారా ఎవరో ఒక అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాలని బలవంతం చేస్తాడు. అలా అనుకోకుండా ఫేస్‌బుక్‌లో మేఘనా పద్మావతి(రకుల్ ప్రీత్)ని దేవ్ చూస్తాడు. తొలి చూపులోనే ఇష్టపడి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు. కానీ మగాళ్లను మోసగాళ్లలా చూసే మేఘనాకు ఈ లవ్వు గివ్వు పడవు. అమెరికాలో సొంతంగా ఒక కంపెనీని పెట్టి దానికి సీఈవోగా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉంటుంది. అలాంటి అమ్మాయి ప్రేమను పొందడానికి దేవ్ ఏం చేశాడు? అసలు అతని ప్రేమకు, అడ్వంచర్‌కు సంబంధం ఏంటి? అనేదే సినిమా.

విషయం ఏంటంటే :

నిజానికి అడ్వంచర్, లవ్ రెండూ భిన్న అంశాలు. కానీ అడ్వంచర్‌ లో కూడా ప్రేమ ఉంటుందని, అడ్వంచర్ కు ప్రేమ ఉపయోగపడుతుందని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. అయితే ఆ ప్రయత్నం వికటించింది. కథలో బలం లేకుండా కేవలం అడ్వంచర్, ప్రేమ అనే రెండు అంశాలను ఎంపికచేసుకుని సినిమాను సాగదీశారు. ఫస్టాఫ్‌లో స్నేహితులతో దేవ్ అడ్వంచర్లు, అనుబంధంతో పాటు మేఘనాను కలవడం, ఆమెను ఇంప్రస్ చేయడానికి చేసే ప్రయత్నాలను చూపించారు. ఫస్టాఫ్ రొటీన్ గా ఉన్నా పర్వాలేదనిపిస్తుంది. ఇంటర్వల్‌ కూడా టీవీలో న్యూస్ మధ్యలో వచ్చే అడ్వర్టైజ్‌మెంట్‌లా చాలా సాదాసీదాగా ఉంది. ఇక సెకండాఫ్‌లోనూ మామూలే. దేవ్, మేఘనా మధ్య మనస్పర్థలు, తండ్రితో దేవ్ అనుబంధం, ఎవరెస్ట్ శిఖరాన్ని దేవ్ అధిరోహించడం ఇలా అస్సలు ఆసక్తికరంగా లేని కథనంతో దర్శకుడు నడిపించారు. ఇదొక కుటుంబ కథా చిత్రమని, భావోద్వేగాలకు పెద్దపీట వేశామని విడుదలకు ముందు హీరో కార్తితో పాటు చిత్ర యూనిట్ ప్రచారం చేసింది. కానీ, సినిమా చూసినప్పుడు అలాంటి భావోద్వేగాలేవీ మనకు కనిపించవు. ఉన్న కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా సోసోగా ఉన్న్నాయి.

నటీనటులు :

తన నటన, ఫైట్లు, అడ్వంచర్ ఫీట్లతో ఆకట్టుకున్నాడు కార్తి. ఇక బిజినెస్ ఉమెన్ పాత్రలో రకుల్ ప్రీత్ బాగానే నటించింది. తన స్వార్థం కోసం చూసుకునే అమ్మాయిలా మెప్పించింది. వీరిద్దరి తరవాత సినిమాలో ప్రాధాన్యత ఉన్న మరో పాత్ర విఘ్నేష్. ఈ పాత్రలో ఆర్జే విఘ్నేష్ బాగా నటించాడు. తన నటనతో అప్పుడప్పుడు నవ్వు తెప్పించాడు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అమృత శ్రీనివాసన్ తమ పాత్రల మేర నటించారు. సినిమాకు మరో ప్లస్ సంగీతం. చాలా కాలం తరవాత హేరిశ్ జయరాజ్ మంచి సంగీతం అందించారు. పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘నన్ను వీడి’ పాట గుర్తుండిపోతుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. అలాగే వేల్‌రాజా సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ఇది ఇద్దరు రిచ్ కిడ్స్ మధ్య లవ్ స్టోరీ కాబట్టి సినిమాను కూడా అంతే రిచ్‌గా తెరకెక్కించారు. ఎడిటర్ ఆంటొని ఎల్. రూబెన్ తన కత్తెరకు కాస్త పనిచెప్పి ఉండాల్సింది. మరీ రెండున్నర గంటలు సినిమాను సాగదీసి విసిగించారు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : దేవ్…డా
తెలుగు బుల్లెట్ రేటింగ్: 2/5