దేవెగౌడ చనిపోతారన్న ఎమ్మెల్యే…దాడి !

Hasan MLA Audio Clip About Devagiuda

కర్ణాటకలో , కర్నాటక రాజకీయాల్లో కొద్ది రోజుల నుంచి ఆడియో టేపుల కలకలం కొనసాగుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప బేరసారాలు జరిపినట్టుగా చెబుతున్న ఆడియోలను సీఎం కుమారస్వామి విడుదల చేయడంతో మొదలైన ఈ దుమారం కొనసాగుతూనే ఉంది. దీనికి కౌంటర్ గా వచ్చిన మరో ఆడియో టేపు బయటికి వచ్చి రచ్చ చేస్తోంది. ఓ బీజేపీ ఎమ్మెల్యే జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో టేపు జేడీఎస్ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. హసన్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ గొంతుగా చెప్తున్న తాజా ఆడియో టేపులోని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. త్వరలోనే మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ చనిపోతారని ఆయన కుమారుడు కుమారస్వామి ఆరోగ్యం కూడా పెద్దగా బాగోలేదని ఆ ఆడియో టేపులో రికార్డ్ అయ్యింది. అంతే కాదు త్వరలోనే జేడీఎస్ ఓ చరిత్రగా మిగిలి పోతుందని ఆడియో టేపులో ఉంది. దీన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో జేడీఎస్ కార్యకర్తలు ఉద్రేకానికి లోనయ్యి హసన్ జిల్లాలోని ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే తనను చంపేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ప్రీతమ్ గౌడ ఆరోపించారు. అయితే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడిని ఖండించిన కుమారస్వామి జేడీఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.