నానికి దేవినేనే పోటీ !

Devineni Avinash To Contest

కొడాలి నానిపై దేవినేని వారసుడిని బరిలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దూషణలతో విరుచుకుపడే కొడాలి నానిని ఓడించాలంటే దేవినేని వారసుడే కరెక్ట్ అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. దేవినేని నెహ్రు తనయుడు దేవినేని అవినాష్‌. ఇప్పటికే గుడివాడ నియోజకవర్గంలో చాపకింద నీరులా కార్యక్రమాలను చేపట్టిన అవినాష్‌ ఇకపై పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. తండ్రి ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించడంతో పాటు ఆయనకు దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ అనుచరులు ఉన్నారు. గుడివాడలోనూ దేవినేని నెహ్రూ అనుచరవర్గం ఉంది.

దానికి తోడు నిజానికి గుడివాడ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరగ్గా కేవలం రెండుసార్లు మాత్రమే ఇతర పార్టీలు విజయం సాధించాయి. అక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ టీడీపీలో ఉన్న సమయంలో కొడాలి నాని.. ఆ క్యాడర్‌ను సొంత అనుచరవర్గంగా మలుచుకుని పట్టు సంపాదించుకున్నారు. అందుకే టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ కొడాలి నానికి మద్దతిచ్చారు. అదే సమయంలో టీడీపీకి బలమైన నాయకుడు కరవయ్యారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు ఆ తర్వాత చురుగ్గా వ్యవహరించలేదు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావే అక్కడ పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు పోటీ చేయడానికి మరో ముగ్గురు ముందుకు వచ్చినా యువకుడు అయితేనే కరెక్ట్ అని చంద్రబాబు భావించి టికెట్ ఖరు చేసినట్టు సమాచారం.