జగన్ గూటికే చేరిన టీడీపీ ఎమ్మెల్యే !

Modugula Venugopala Reddy Join To YCP

అనుకున్నట్టుగానే టీడీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణు గోపాల్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపారని హైదరాబాద్‌ను ఏపీకి దూరం చేసింది చంద్రబాబేనని ఆయన మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు సైనికుడిలా పనిచేస్తానని టీడీపీలో ఎమ్మెల్యేని అయినా ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉండలేకే ఆ పార్టీని వదిలి పెట్టినట్టు మోదుగుల వేణుగోపాల రెడ్డి తెలిపారు. గుంటూరుకు గల్లా జయదేవ్‌ అతిథి లాంటి వ్యక్తని ఎద్దేవా చేశారు.

గుంటూరు నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఆయనకీ బ్యాలెట్‌‌తో గుణపాఠం చెబుతామని తెలిపారు. తన లాంటి నాయకుణ్ని వదులుకోవడం టీడీపీ ఖర్మ అని పేర్కొన్నారు. అయితే గుంటూరు లోక్ సభ స్థానం నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మోదుగుల అన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి స్థానం లేకుండా చేస్తామని ఆయన ప్రకరించారు. వైఎస్ జగన్ తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తనతో పాటు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. వైసీపీలో చేరిన అనంతరం గుంటూరు జిల్లా పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మోదుగుల మాట్లాడారు.