హోటల్‌లో డాక్టర్ ఆత్మహత్య

హోటల్‌లో డాక్టర్ ఆత్మహత్య

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్న మెదక్‌కు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘నా ఫోన్‌ ఎత్తడం లేదు. ఆయనకు డయాబెటీస్‌ ఉంది. అన్నం తిన్నారో.. లేదో..? కింద పడి ఉంటారేమో ఒక్కసారి చూడండి’ అంటూ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భార్య కోరడంతో హోటల్‌ సిబ్బంది గది కెళ్లారు. ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో ఏం జరిగిందో చూద్దామని భవనం వెనుకున్న పైపును పట్టుకుని సిబ్బంది లోపలకు దిగారు. కొద్దిగా తెరిచి ఉన్న కిటికీలో నుంచి కనిపించిన దృశ్యం చూసి కంగుతిన్నారు. మళ్లీ పైకొచ్చి చెప్పడంతో అసలు విషయం బయటికొచ్చింది.

చంద్రశేఖర్ బెంగళూరుకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నీట్‌ పరీక్ష రాయించేందుకు కుమారుడిని దంపతులిద్దరూ మెదక్‌ నుంచి నగరానికి తీసుకొచ్చారు. అతడిని పరీక్ష కేంద్రంలోకి పంపించాక భార్యను వదిలేసి బెంగళూరు వెళ్లాలని చంద్రశేఖర్‌ నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఇంటి దగ్గరే భార్యకు చెప్పగా ఆమె అంగీకరించింది. తీరా.. అక్కడికొచ్చాకా ఆసుపత్రిలో రోగులు వేచి చూస్తుండటంతో ఆమె వెళ్లిపోయింది. దీంతో ఆత్మహత్యకు వేదికను హైదరాబాద్‌కు మార్చి ఉంటాడని పోలీసులు నిర్ధారణకొచ్చారు.

ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే చంద్రశేఖర్‌.. తాడు, 140 నిద్రమాత్రలు, రూ.73 వేల నగదు ఓ బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు రెండు.. మూడు రకాలుగా యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చివరకు తాను తెచ్చుకున్న తాడు సాయంతోనే ఉరేసుకున్నట్లు తేల్చారు. అయితే ఒంటిపై బట్టల్లేకుండా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది మిస్టరీగానే మారింది. అసలు ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది..? హోటల్‌లో దిగినప్పటి నుంచి చంద్రశేఖర్‌ను కలిసేందుకు ఎవరైనా వచ్చారా..? అంటూ పోలీసులు సీసీఫుటేజీని జల్లెడ పడుతున్నారు. ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడారా..? అన్న అనుమానంతో కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు.