కరోనా స్పెషల్ ఆఫీసర్స్.. గెస్ట్ హౌస్ లో మందు.. చిందులు…

Binge Drinking

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తుంటే.. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గెస్ట్‌హౌస్‌లో మద్యం తాగుతూ మాంసాహార విందు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కరోనా స్పెషల్ డ్యూటీలో ఉన్న అధికారులు ఈ ఘటనకు పాల్పడటంతో అంతటా వెలుగుచూసింది.

కాగా మండల స్థాయి అధికారుల్లో కొందరు రాత్రివేళ మద్యం, మాంసాహారంతో విందు చేసుకొంటూ మీడియాకు దొరికిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిరలో చోటుచేసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తుంటే.. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు మండల అధికారి విశ్రాంతి భవనంలో మందు పార్టీ చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. వీరంతా కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధులు నిర్వహిస్తున్న వారేనని తెలుస్తోంది.

కాగా అధికారుల మద్యం పార్టీ గురించి తెలుసుకున్న మీడియా వెంటనే అక్కడికి చేరుకోగా.. ఓ అధికారి ఏకంగా బాత్రూమ్‌లో దూరాడు. సుమారు 30 నిమిషాల పాటు లోపలే ఉండిపోయాడు. మరో అధికారి ఏకంగా గోడదూకి పరారై పోయాడు. టేబుల్‌పై మద్యం సీసాలు, మాంసాహారం, ఇతర వంటకాలు చూసి మీడియా ప్రతినిధులు వాటిని ఫోటోలు, వీడియోలు తీసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.