మహిళల భద్రత కోసం ఈ- రక్షాబంధన్‌

మహిళల భద్రత కోసం ఈ- రక్షాబంధన్‌

రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్‌ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్‌’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్‌ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్‌ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్‌ ఉమెన్‌కు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్‌లైన్‌లో శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్‌, యానిమేషన్స్‌, రీడింగ్ మెటీరియల్‌ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

అదే విధంగా అక్కాచెల్లెమ్మలకు ఏదైనా సమస్య ఉంటే దిశ యాప్‌, దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక తమ ప్రభుత్వం మహిళా సాధికారికతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పునరుద్ఘాటించిన సీఎం జగన్‌.. అన్ని రంగాల్లో వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. సుమారు 30 లక్షలమంది మహిళల పేరుతో ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. మద్య నిషేధంలో భాగంగా బెల్ట్‌ షాపులు పర్మిట్‌ రూంలను పూర్తిగా తొలగించామని, 33శాతం వైన్‌షాపులను తగ్గించామని తెలిపారు. కాగా ఈ- రక్షాబంధన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజిని, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సీఎం జగన్‌కు రాఖీ కట్టారు.