ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా నకిలీ వైద్యుల గుట్టు రట్టు….

ప్రజలను మోసం చేస్తున్న నకిలీ ఎంబీబీఎస్‌ డాక్టర్లు

కర్నాటక సరిహద్దులోని కుగ్రామాల్లో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు నకిలీ వైద్యులు పుట్టుకొచ్చారు. తాము ఎంబీబీఎస్ చేసిన వైద్యులమంటూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న నకిలీ డాక్టర్ల లీలలు గుట్ట రట్టైంది. నకిలీ ఎంబీబీఎస్‌ డాక్టర్ల ఆట కట్టించిన ఘటన స్థానిక గంగవరం మండలంలో తాజాగా చోటు చేసుకుంది. నాలుగురోడ్లు గ్రామం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రి సేవలు కావాలంటే సమీపంలోని పత్తికొండ లేదా పలమనేరు ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలోని ప్రజలు అక్షరాస్యత తక్కువగానే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా ఎల్డూర్‌కు చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి తాను ఎంబీబీఎస్‌ డాక్టర్‌నంటూ గ్రామంలో ఆర్‌వీ క్లినిక్‌ పేరిట మూడు నెలల క్రితం హైవేకు ఆకునుని ఆస్పత్రి ఏర్పాటు చేశారు. రోగులు అక్కడికి రావడం మొదలు పెట్టారు.

అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ… అతను ఉన్నట్టుండి మాయమైపోయాడు. అదే ఆస్పత్రిలో మహేంద్ర అనే కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి తాను ఎంబీబీఎస్‌ డాక్టర్‌నంటూ వైద్యం అందించడం, రోగులకు ఆరోగ్యాన్ని చూడటం మొదలు పెట్టాడు. అనుభవం, కనీస జ్ఞానం కూడా లేక నాడి కూడా చూడటం తెలియని మహేంద్ర సేవలపై స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే కొందరు రోగులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గంగవరం మండల వైద్యాధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పత్తికొండ పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ యుగంధర్‌ తాజాగా ఆ క్లినిక్‌ను తనిఖీ చేశారు. వైద్యుడుగా చెలామణి అవుతున్న మహేంద్ర అసలు డాక్టరే కాదని.. అతనికి ఏమాత్రం అనుభవం లేదని తేల్చేశారు. క్లినిక్‌లో ల్యాబ్, రోగులకు బెడ్లు, అక్కడే మందులు ఉండడాన్ని చూసి విస్తుపోయారు. వెంటనే క్లినిక్‌ను సీజ్‌ చేసి, అక్కడున్న బోర్డులను తొలగించారు. మహేంద్ర, శివకుమార్‌పై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు వివరించారు. అంతేకాకుండా ప్రజలు ఇలాంటి వారిని నమ్మకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని వైద్యాధికారులు వెల్లడించారు.