ఒమిక్రాన్ బాధితుడు మృతి

ఒమిక్రాన్ బాధితుడు మృతి

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 1270 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతిచెందాడు. పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది.

కాగా యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. బాధితుడు గుండెపోటుతో చనిపోగా.. అనంతరం చేసిన పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. కానీ, ఆరోగ్య నిపుణులు మాత్రం ఆ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కోవిడ్ మరణంగా వర్గీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరణించిన వ్యక్తికి ట్రావెల్‌ హిస్టరీ ఉందని, నైజీరియా నుంచి వచ్చినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అతడు గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని పేర్కొంది. ‘బాధితుడు మరణానికి కోవిడ్ కారణం కాదు.. కానీ, యాదృచ్ఛికంగా పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబొరేటరీ నివేదిక అతడికి ఒమిక్రాన్ వేరియంట్‌ సోకినట్లు నిర్ధారించింది’ అని మహా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు రోజురోజకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 190 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారునున్నారు. దీంతో మొత్తం మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 450కి చేరింది.