రూపురేఖల్నే మార్చిన ఫ్లైఓవర్లు

రూపురేఖల్నే మార్చిన ఫ్లైఓవర్లు

ఎవరేమనుకున్నా.. ఎవరేం చెప్పినా గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లు నగర రూపురేఖల్నే మార్చివేశాయి. ముఖ్యంగా ఎస్సార్‌డీపీ కింద చేపట్టిన పనులు ఎలాంటి నిధుల కొరత లేకుండా జరగడమే అందుకు కారణం. నిధుల లేమితో పనులు కుంటుపడవద్దనే తలంపుతో ప్రభుత్వం ఎస్సార్‌డీపీని ఏర్పాటుచేసి.. బాండ్లతో నిధులు సమకూరేలా చేయడమే కాక బ్యాంకు లోన్లకు అనుమతిచ్చింది. దీంతో జరిగే పనుల కనుగుణంగా బిల్లుల చెల్లింపులు జరుగుతుండటంతో పనులు వడివడిగా సాగుతున్నాయి.

దీనివల్ల జీహెచ్‌ఎంసీకి ఎంతో ఆర్థిక భారం పెరిగినా.. కళ్లముందరి ఫ్లై ఓవర్ల వల్ల ప్రజల ట్రాఫిక్‌ చిక్కులు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా నిర్మించారనే ఆరోపణలున్నా రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీతో మున్ముందు వాటి ఉపయోగం తెలుస్తుదంటున్న వారూ ఉన్నారు. దశల వారీగా చేపట్టిన పనుల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని రూ. 4500 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇతర విభాగాలవి కూడా కలిపితే వాటి విలువ రూ.6 వేల కోట్లు. అన్ని విభాగాలవీ వెరసి దాదాపు రూ. 2 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి.