గుజ‌రాతీల స్థానాన్నితెలుగువారు ఆక్ర‌మించేలా ఉన్నారు…

Gautam Adani Praises Chandrababu in CII partnership summit

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డమే ల‌క్ష్యంగా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు విశాఖ‌లో ప్రారంభ‌మైంది. మూడు రోజుల పాటు జ‌రిగే ఈ స‌ద‌స్సులో 40దేశాల‌కు చెందిన 2వేల‌మంది ప్ర‌తినిధులు పాల్గొంటున్నారు. 11 అంశాల‌పై ప్లీన‌రీ సెష‌న్లు నిర్వ‌హించ‌నున్నారు. భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, కేంద్ర మంత్రులు అశోక్ గ‌జ‌ప‌తిరాజు, సురేశ్ ప్ర‌భు, ప్ర‌ముఖ పారిశ్రామిక దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. స‌ద‌స్సు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా సీఎం కీలక ప్ర‌సంగం చేశారు. పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌మ్య‌స్థానంగా నిలుస్తోంద‌న్నారు. రాష్ట్రంలో మూడోసారి భాగ‌స్వామ్య స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని, గ‌తేడాది కంటే ఈ సారి స్పంద‌న బాగుంద‌న్నారు. 2022 నాటికి దేశంలో మూడో స్థానంలో, 2029నాటికి దేశంలో అగ్ర‌స్థానంలో రాష్ట్రాన్ని నిల‌పాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తున్నామ‌ని, రాష్ట్రంలో భారీగా విదేశీ పెట్టుబ‌డులు ఆక‌ర్షిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో శాశ్వ‌త క‌న్వెన్ష‌న్ కేంద్రం, షాపింగ్ మాల్స్, హోట‌ళ్లు ఏర్పాటుచేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. స‌ద‌స్సులో ప్ర‌సంగించిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు ఏపీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

గుజ‌రాతీలు పెట్టుబ‌డిదారులుగా, వ్యాపార‌వేత్త‌లుగా పేరు గ‌డించార‌ని, ఇప్పుడా స్థానాన్ని తెలుగు వారు ఆక్ర‌మించేలా ఉన్నార‌ని అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం అదానీ అన్నారు. తెలుగు ప్ర‌జ‌ల‌ను ఈ విధంగా తీర్చిదిద్ద‌డంలో సీఎం చంద్ర‌బాబు కృషి ఎంతో ఉంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పారిశ్రామిక విధానాలు చాలా అనుకూలంగా ఉన్నాయ‌ని, పారిశ్రామిక భార‌త్ నిర్మించ‌డంలో కేంద్రానికి ఏపీ బాగా స‌హ‌క‌రిస్తోంద‌ని తెలిపారు. సాంకేతిక‌త‌ను సామాన్యుడికి చేరువ చేసేందుకు దేశంలో కృషి జ‌రుగుతోంద‌ని, విద్యారంగంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని, పెద్ద మొత్తంలో ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే ఉన్నాయ‌ని తెలిపారు. ఏపీలో వివిధ రంగాల్లో త‌మ గ్రూప్ భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని అదానీ చెప్పారు. భార‌త పరిశ్రమ‌ల స‌మాఖ్య‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ధ్య బ‌ల‌మైన బంధం ఉంద‌ని సీఐఐ అధ్య‌క్షురాలు శోభనా కామినేని అన్నారు. రాష్ట్రానికి కొత్త త‌ర‌హా పారిశ్రామిక ప‌రిస్థితులు వ‌స్తున్నాయ‌ని, యువ పారిశ్రామిక‌వేత్తలు ఉద్యోగ క‌ల్ప‌నకు ముందుకొస్తున్నార‌ని తెలిపారు. పరిశ్ర‌మ‌ల‌కు, విద్యాసంస్థ‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున అవ‌కాశాలు క‌ల్పిస్తోంద‌ని ప్ర‌శంసించారు. కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప్ర‌జ‌ల ముందుకు తెస్తోంద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు దావోస్ లో ఐటీ టెక్ నిపుణుడిగా రాష్ట్రంలోని అవ‌కాశాల‌పై వివ‌రించార‌ని ఆమె గుర్తుచేశారు.