అదిగో గెలుపు కేక…part 1…నడుస్తున్న నిజం

 

“నీది దీర్గాయుష్షు .ఉరి వేసుకున్నా ఆ తాడు కూడా తెగడిపోతుంది”.. జోస్యుడి నోటి వెంట ఆ చివరి మాట వినగానే చైతన్య మొహంలో చివరి రక్తపు బొట్టు కూడా ఇంకినట్టు అయిపోయింది. మెదడు పని చేయడం ఆగిపోయింది. గుండె ఆగిపోతే బాగుండు అనుకుంటే ఇలా అయ్యింది. ఒక్కసారిగా చైతన్య శూన్యం లోకి జారిపోయాడు. ఆవరించిన నిస్సత్తువని , ఏమీ చేయలేని అసహాయతని వెంటబెట్టుకుని ఆ ఏసీ గది నుంచి చెమటలు కక్కుకుంటూ బయటకు వచ్చాడు చైతన్య.

45 ఏళ్ల జీవితం ఒక్కసారిగా సినిమా రీలులా చైతన్య కళ్ళ ముందు తిరిగింది. బతుకు మీద ఆశలు , భవిష్యత్ గురించి చెప్పుకున్న ఊసులు వెక్కిరిస్తూ కనిపించాయి. తాను ఊహించుకున్న ప్రపంచం మాట అటుంచి ఉంటున్న ప్రపంచమే తల్లకిందులైన వాస్తవం చైతన్య జీర్ణించుకోలేకపోతున్నాడు. అయితే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా చైతన్యకి ఓ నమ్మకం ఉండేది. ఓ ఆశ అతన్ని ఊరిస్తుండేది. అదే చావు. బతకలేనప్పుడు , తాను అనుకున్నట్టు బతుకు లేనప్పుడు , అవమానాలు తప్ప ఇంకో జీవితం లేదు అనుకున్నప్పుడు చావు తనను ఈ మానసిక యుద్ధం నుంచి తప్పిస్తుందని ఓ నమ్మకం. మృత్యువు తనకు ఆశ్రయం కల్పిస్తుందని ఓ ఆశ. ఇప్పుడు ఆ కొనవూపిరి ఆశను కూడా ఈ జోస్యుడు చంపేశాడు. ఓ రకంగా నువ్వు చావడానికి కూడా పనికిరావని చెప్పి అలసిపోయిన శరీరంలో మిగిలిన శక్తుల్ని కూడా నిర్వీర్యం చేసాడు. ఇంకా ఇలాగే చాలా ఏళ్ళు బతకాలి అన్న ఆలోచన తో చైతన్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మెదడులో రేగుతున్న ఆలోచనల సుడిగుండంతో పోలిస్తే హైదరాబాద్ ట్రాఫిక్ పెద్ద లెక్క అనిపించలేదు. పావుగంటలో ఆఫీస్ కి వచ్చాడు. టేబుల్ మీద లంచ్ రెడీ. తినాలి అనిపించలేదు. కానీ ఏదో కెలికాడు. ఉహూ …ఎక్కడం లేదు. చేతులు కడిగేసాడు. చివరి తలుపులు కూడా మూసుకుపోయాయి అన్న ఆలోచన అతన్ని కుదురుగా ఉండనీయడం లేదు. తన తలరాత ఇంత దారుణంగా రాసిన దేవుడి మీద కోపం వచ్చింది. అంతలోనే ఇంకేమి చేస్తాడో అన్న భయం కూడా ఆవహించింది.అంతలోనే ఇంతకన్నా ఏమి చేస్తాడులే అన్న మొండితనం . ఈ సందిగ్ధం మధ్యే అతని చేయి సెల్ ఫోన్ మీదకు వెళ్ళింది.
ఓ గంట క్రితం నరకం ముందు పద్దులు చదివిన చిత్రగుప్తుడిలా ఛైతన్య ముందు శిక్షల చిట్టా కర్ణకఠోరంగా వినిపించిన జోస్యుడి గొంతు ఇప్పుడు సుతిమెత్తగా హలో అంది. చైతన్య తన అసహనాన్ని కప్పిపుచ్చుకుంటూ తన పేరు , వివరాలు చెప్పి ఇందాక తన గురించి చెప్పిన విషయాలు అన్ని మళ్ళీ చెప్పగలరా అని అడిగాడు. ఆ జోస్యుడు గంట కిందట చెప్పింది తూచా తప్పకుండా అప్పజెప్పాడు. ఇంతకీ మీరు ఏమి చదువుకున్నారు ? జ్యోతిష్యం లో ఏ గ్రంధాలు ప్రామాణికంగా తీసుకుని ఈ జోస్యం చెప్పారు? మీకు విద్య నేర్పిన గురువులు ఎవరు? ..ఇలా చైతన్య దగ్గర నుంచి వచ్చిన ప్రశ్నలతో జోస్యుడికి విషయం అర్ధం అయ్యింది. తాను చెబితే వినేవాళ్లే తప్ప , ప్రశ్నించేవాళ్ళని ఎప్పుడూ చూడని అతనికి మాటల్లో తడబాటు వచ్చింది. ఆ తడబాటులోనే మీరు ఇచ్చిన అమౌంట్ కి డబల్ అమౌంట్ ఇస్తా అన్న ప్రతిపాదన కూడా వచ్చింది. మా సేవలు నచ్చలేదు కాబట్టి ఇలా చేస్తున్నానని ఆ జోస్యుడు చేసుకుంటున్న సమర్ధింపు చూసి చైతన్యకి నవ్వు వచ్చింది. గంట కింద ఆ జోస్యుడి ముందు యమధర్మరాజు ముందు నిలుచున్న పాపిలా తన గోడు వెళ్లబోసుకున్న తన మీద తనకే జాలి ,అసహ్యం కలిగింది. ఏమైతేనేం ? జోస్యుడు ఇచ్చిన ఆఫర్ స్వీకరించి ఆ ఫోన్ పెట్టేసాడు చైతన్య. ఆలోచనలో పడ్డాడు. దాన్ని భంగం చేస్తూ ఓ పదినిమిషాల్లో సెల్ ఫోన్ కి తన అకౌంట్ లో జోస్యుడి అకౌంట్ నుంచి డబ్బు వచ్చిన మెసేజ్.
ఆ మెసేజ్ చూడగానే చైతన్యకి కొద్దిగా ఉపశమనం. జరిగిన తప్పుని ప్రశ్నిస్తే గంటలో న్యాయం జరిగింది. తప్పు చేసిన వాడు తప్పు ఒప్పుకుని , నష్టపరిహారం ఇచ్చి మరీ తప్పుకున్నాడు. దీంతో చైతన్యకి కాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది. తనకు ఇంకా చావు అవకాశం ఉందన్న నమ్మకం కలిగింది. అంతలోనే ఆత్మహత్య విషయంలో ఆత్మవిశ్వాసం కలిగినందుకు సిగ్గు కలిగింది. ఈ గజిబిజి ఆలోచనల నుంచి కాస్త రిలీఫ్. ఆ ఫీలింగ్ నష్ట పరిహారంగా వచ్చిన డబ్బు వల్ల వచ్చిందా ? నిజంగా డబ్బుకి అంత పవర్ ఉందా ?. ఈ ప్రశ్నకు చైతన్య విశ్లేషణా శక్తి మంచి జవాబే ఇచ్చింది. తనకి కిక్ ఇచ్చింది వెయ్యి రూపాయలు కాదు. వాటిని సాధించిన పద్ధతి. ఈ విషయాన్ని కాస్త హేతుబద్ధంగా ఆలోచించాక చైతన్య మదిలో ఓ మెరుపు మెరిసింది. ప్రశ్నిస్తే ఫలితం వస్తుంది. అది మంచి కావొచ్చు , చెడు కావొచ్చు.
ఒకప్పుడు ఇలాగే ప్రశ్నించినందుకు తన జీవితమే తల్లకిందులు అయ్యింది. ఒకే పనికి రెండు రకాల ఫలితాలు ఎందుకు ? ఈ ప్రశ్నకు వెంటనే జవాబు దొరికింది. నేను ఏమిటో తెలియని జోస్యుడు నన్ను అంచనా వేయలేక తన తప్పు ఒప్పుకుని నిష్క్రమించాడు. తానేమిటో తెలిసిన వాళ్ళు మాత్రం ఎదురు దాడికి దిగారు. ఇలా ఆలోచించగానే చైతన్యకి తాను ఇన్నాళ్లు చేసిన తప్పు ఏమిటో అర్ధం అయ్యింది. సహనం ముసుగులో అన్నిటినీ భరించడమే జీవన విధానంగా మార్చుకుని తాను చేసిన తప్పు ఏమిటో బాగా అర్ధం అయ్యింది. ఔను …తానేమిటో అర్ధం అయితే ఎవరూ లెక్క చేయరు. తమలో ఎన్నో మర్మాల్ని దాచుకుంటున్నారు కాబట్టే కనిపించని ఆ దేవుడు , కనిపించే ఈ ప్రకృతి అంటే మనిషికి భక్తి , భయం. ఒక్కసారి తాను ఏమిటో అర్ధం అయితే ఇక అంతేనా ? ఎక్కడా నిజంగా ఉండకూడదా ? వుండకూడదేమో !. నిరంతరం పక్కన ఉన్నాడనే కదా ఆ శ్రీకృష్ణుడి లోతుపాతులు తెలుసు అన్న నమ్మకంతో అర్జునుడు సైతం గయుడి విషయంలో యుద్ధానికి సిద్ధపడింది. 8848 అడుగుల ఎత్తు వున్న మౌంట్ ఎవరెస్టు ని ఇప్పటిదాకా నాలుగు వేల మంది ఎక్కితే , ఇప్పటికీ  ఓ మిస్టరీగానే వున్న మౌంట్ కైలాష్ (6638 ) జోలికి ఎవరూ వెళ్లే సాహసమే చేయడం లేదు. నీలో ఏదో రహస్యం మిగిలేంత వరకే నీకు విలువ అని చెప్పడానికి ఇంతకు మించిన దృష్టాంతాలు ఏముంటాయి ?
చైతన్య ఓ స్థిర నిర్ణయానికి వచ్చాడు. తనను తాను కొత్తగా , సరికొత్తగా ఎలా ఆవిష్కరించుకోవాలో నిర్దేశించుకున్నాడు. ఇకపై తన గమ్యం , గమనం ఓ మిస్టరీలా నిలిచిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఓటమి తిష్ట వేసుకున్న చోటు నుంచి ప్రపంచానికి గెలుపు కేక వినిపించడానికి ఓ పధకం రూపొందించుకున్నాడు. ప్రపంచానికి తన గెలుపు కేక వినబడాలంటే ముందుగా తాను గెలవాల్సింది ఇతరుల్ని కాదు. తనని … .
చావు  కోసం వెంపర్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది ? ఆఖరి ప్రయత్నంగా అయిన వాళ్ళ దగ్గర కాకుండా డబ్బులు పుచ్చుకుని నాలుగు మాటలు చెప్పుకునే ఓ అపరిచితుడు ముందు నిలబడే అజ్ఞానం  , అసహాయత ఎందుకు కమ్మింది?  ..ఈ ప్రశ్నలకు సమాధానంలా చైతన్య కి తన జీవిత ప్రస్థానం కళ్ళ ముందు లీలగా కదులుతోంది …వచ్చే వారం తదుపరి భాగం.