అదృశ్యమవుతున్న యువతులు

అదృశ్యమవుతున్న యువతులు

వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరారం రాజీవ్‌గృహకల్పకు చెందిన యాల పైడితల్లి కుమార్తె భారతి (21) ప్రైవేట్‌ ఉద్యో గం చేస్తోంది. ఈ నెల 20న డ్యూటీ కని కొంపల్లికి వెళ్లిన యువతి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆమె జాడ తెలియలేదు. సోమవారం భారతి తండ్రి పైడితల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దుండిగల్‌ గ్రామానికి చెందిన నర్సింహ కుమార్తె శిరీష (22) విద్యార్థి. కాగా 19న కుటుంబ సభ్యులు ఇంట్లోలేని సమయంలో ఎవరికి చెప్ప కుండా బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి నర్సింహ సోమవారం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భర్త చేయి చేసుకోవడంతో మనస్తాపం చెందిన భార్య ఇంటికి నుంచి వెళ్లిపోయిన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బహదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన లక్ష్మారెడ్డి, పద్మావతి (38)లు భార్యాభర్తలు. ఈ నెల 20న రాత్రి 10 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో లక్ష్మారెడ్డి తన భార్య పద్మావతిని కొట్టాడు. గొడవ సద్దుమణిగిన తరువాత కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు. కాగా సోమవారం నిద్ర లేచి చూసేసరికి పద్మావతి కనిపించలేదు. చుట్టు పక్కల, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆమె జాడ తెలియలేదు. దీంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.