ఇంట్లో తీరికగా… ఆన్ లైన్ మార్కెట్స్…

ఒకప్పుడు ఆనందాలకు నెలవుగా… హరివిల్లుగా ఉన్న ఇల్లు ఇపుడు బందీఖానా అయింది. ఒక్క రోజు సెలవు దొరికితే ఎగిరి గంతులేసే పిల్లలు రోజుల తరబడి పాఠశాలల మూత పడడంతో ఇప్పుడు ఇంట్లోనే ఆడుకోవాలంటూ ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు. ఇదంతా కరోనా ఎఫెక్ట్. ఈ మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అయ్యింది.

అయితే పిల్లలూ, పెద్దలూ అంతా ఇంటికే పరిమితం కావల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావంతో ఇప్పటికే ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారాలు పడకేశాయి. విమానయాన, పర్యాటక ఆతిథ్య తదితర రంగాలపై కరోనా తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.
అదేవిధంగా ఇదే సమయంలో కొత్త దారులు తెరచుకుంటున్నాయి. జనానికి దగ్గరయ్యేందుకు చాలా సంస్థలు ఆన్ లైన్ ను సాధనంగా మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఆన్ లైన్ అంటే బ్యాంకింగ్ కు, షాపింగ్ కు, ఎంటర్టైన్మెంట్ కు పరిమితమయ్యాయి. కానీ ఆ భావనను చెరిపేస్తూ ఇప్పుడు కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఈ మధ్యనే ఆన్ లైన్ లో పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాస్ లు చెప్పే సంస్థలు పెరిగాయి. కొత్త బిజినెస్ ఐడియాలు చెప్తామంటూ కొందరు… పాజిటివ్ థింకింగ్ తరగతులంటూ మరికొందరు.. ఆన్ లైన్ లోనే ఇంటరాక్టివ్ క్లాస్ లు కొనసాగిస్తున్నారు. మరి అలాంటి వాటిని చూసుకుంటీ కరోనాపై భయాన్ని వీడాలని కోరుకుంటున్నాం.