గురుపూర్ణిమ సందేశం 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గురుపూర్ణిమ అనగా……..

ఆషాడపూర్ణిమ మహాపవిత్రమైన పర్వదినం. ఆషాడ పౌర్ణమిని గురు పూర్ణిమ అనికూడా పిలుస్తారు ఈ రోజు గురు పూజా మహోత్సవం చేయడం దేశమంతా పరిపాటి. ఇది ఆధ్యాత్మిక విషయాలకు అన్నిటికి సంవత్సర ఆరంభం. అందుకే సాధకులందరికి మహా పర్వకాలం. సాధు, సన్యాసులు, పీఠాధిపతులు రాబోయే నాలుగునెలలూ జపద్యానాలు దీక్షగా ‘చాతుర్మాసదీక్ష’ చెయాలన్నది నియమం. సంవత్సరంలో మిగిలిన సమయాన్ని సంచారానికి ఉపయోగించినా తమ ఆధ్యాత్మిక సాధనకు ఈ నాల్గు నెలలూ ఉపయోగించాలి. ఈనాలుగు మాసాల దీక్షలో విధిగా గురువు యొక్క ఉపాసన చేస్తారు. గురువు తనకేదైతే ఉపదేశించారో అది నిష్టగా సాధనగా చేసేకాలానికి ‘గురుపూజ’తో ప్రారంభించే రోజు ఈ ‘గురుపూర్ణిమ’. వేద విభాగం చేసి ప్రతివారికి ఉపనయన సాంప్రదాయాన్ని గాయత్రీ మంత్రాన్ని తన వేదశాఖను స్మరించే విధిని ఏర్పరిచిన వారు- శ్రీ మహా విష్ణువు అంశతో జన్మించిన వేదవ్యాస మహర్షి. ఆదిగురువైన వ్యాసుల వారి పుట్టిన రోజైన కారణంగా ఈ గురుపూర్ణిమను ‘వ్యాసపూర్ణిమ’ అని కూడా పిలుస్తారు. శంకర, రామానుజ, మద్వా చార్య వంటి గురువులకు కూడా గురువు మరియు ఉపనయన దీక్ష, చాతుర్మాస దీక్ష, పూజ, గురు ఉపాసన ఇచ్చినటువంటి గురువు కనుకనే వ్యాసులవారి పేరు మీద ఇది ‘వ్యాసపూర్ణిమ’ అయింది.

ప్రతి వారు తన గురువును వ్యాసుని ప్రతిరూపంగా భావించి, గురు పూజనే వ్యాస మహర్షికి చేసే పూజగా చేయాలి. ఈ సమయంలో శిష్యుని సాధనలో లోటు పాట్లు సమీక్షించి సాధనలో తర్వాతి మెట్టును గురువు ఇచ్చేటటువంటి రోజు గురుపూర్ణిమ. సాధన సక్రమంగా సాగితే తర్వాత ఇవ్వవలసిన గురు ణవశషమంత్రాన్ని గురువిస్తాడు. ఉపనయనంచేసే గురువు, జ్ఞానమిచ్చేగురువు, వేదాధ్యయనంచేసే గురువు ఇచ్చే ఉపదేశమే ‘గురుమంత్రం’. పూర్వం వేదవిద్యలను నేర్పేటటువంటి గురువులే ఆధ్యాత్మిక విద్యలైన యోగంలోనూ, మంత్రశాస్త్రంలోనూ– ఒక క్రమపద్దతిలో పన్నెండు సంవత్సరములు శిక్షణ ఇచ్చేవారు. అంతేకాదు ఆశ్రమాలలో చాలామంది శిష్యులకు ఏమంత్రమూ ఇచ్చేవారుకాదు. గురువు యొక్కనామమే గురుమంత్రము. అందుకే గురుగీతలో “గురుబ్రహ్మ……” అని గురువే పరబ్రహ్మగా ఉపాశించే విధానం తెలియచేయబడింది. ఆవిధానాన్ని ‘ఆచార్యోపాసన’గా గురుపూర్ణిమనుంచే ప్రారంభించే పద్దతే సాంప్రదాయంగా ఉంటూవచ్చింది. అంతేకాక సాధనలో శిష్యుని మనస్సు నిలకడ కుదరదు. తనంతతాను మనస్సు నిలపలేడు. అట్టివారికి(మనమంతా అట్టివారమే) గురువుయొక్కరూపం మీద శ్రద్దాభక్తులతో ధ్యానమునిలిపి గురువుయొక్క ఆజ్ఞ తీసుకుని శరణాగతిచేసి గురువునే ధ్యానిస్తే, ఆగురుమూర్తి ద్యానమే స్థిరంగా వుండేలాగ నిలిపే సాధన – అందుకే “ధ్యానమూలం గురౌఃమూర్తి! పూజా మూలం గురౌః పదం! మంత్రమూలం గురౌః వాక్యం! మోక్షమూలం గురౌః క్రుపా!” ధ్యానమునకు మూలం గురువే అని ‘గురుగీత’ చెబుతుంది.

కాబట్టి శాస్త్రవిధానంలో గురువు పాదములు కడిగి షోడషోపచారములతో పూజించి, దక్షిణ తాంబూలములతో మూడు ప్రదక్షిణలుచేసి సాష్టాంగ నమస్కారముచేసి తన మనస్సు శరీరము సంపదలను గురువుకు శరణాగతిచేసి శిష్యుడు గురుపూర్ణిమనాడు గురుపూజావిధానం పూర్తిచేయాలి

వ్యాస పూర్ణిమను గురించిన పురాణగాధ :

వారణాసిలో వేదనిధి, వేదవతి అనుబీద బ్రాహ్మణ దంపతులుండే వారు, భక్తీ జ్ఞానములు కలిగిన పుణ్య దంపతులైనప్పటికి, వ్రతములు, దానములు మొదలగు ఎన్ని పుణ్యకర్మలు చేసినా వారికి సంతానము కలుగలేదు. ఒకరోజు వేదనిధి– వ్యాసులవారు ప్రతిరోజూ మధ్యాహ్నం రహస్యంగా గంగానదికి వస్తారన్న విషయం తెలుసుకున్నాడు. ఆసమయంలో ఆయన దర్సనం చేసుకుని అభీష్టసిద్ధిని పొందాలని సంకల్పించుకుని గంగాతీరాన్ని చేరుకున్నాడు. చాలాసేపు అయింది. చివరికో బిక్షువు దండం ధరించి వచ్చాడు. వేదనిధి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఎంత కసిరినా చీదరించు కున్నా వదిలిపెట్టకుండా ఇలా అన్నాడు “మహానుభావా తమరు సాక్షాత్తూ వ్యాసమహర్షులు. ఆసంగతి నాకుతెలుసు అందుకే మిమ్ము శరణు పొందాను“. అ భిక్షువు బెదురుగా అటూ ఇటూ చూసి అతన్ని చేరదీసి “ఈరహస్యం బైటకు తెలియకూడదు నీకేం కావాలో కోరుకో“ అన్నాడు. “ప్రభూ రేపు నా తండ్రి గారి శ్రాద్దము ఉన్నది మీరు బ్రాహ్మణార్దం భోజనానికి దయచేయవలసినది ఇదే నాకోరిక” అన్నాడు. వ్యాసమహర్షి సరే అని అంగీకరించి వెళ్ళిపోయాడు.

వారు పేదవారైనా ఆరోజు ఏదోవిధంగా శక్తికొలదీ అనేక భక్ష్యభోజ్యాలతో భోజనం తయారు చేసి ఉంచారు తులసి, సాలగ్రామాలను పూజకు సిద్దంచేశారు. నిన్నటి దివ్యపురుషుడు మళ్లీ వచ్చాడు స్నానాదికములు కానిచ్చి ఆచమించి పూలు,తులసితో సాలగ్రామార్చనచేసి సాష్టాంగ నమస్కారం చేసి కాసేపు ధ్యానించాడు వేదనిధి ఆయనను అర్ఘ్యపాద్యాదులతో పూజించాడు ఆతర్వాత శ్రాద్ధ విధులన్నీ నిర్వర్తించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. వ్యాసుల వారు సంతుష్టుడై కోరిక కోరుకోమన్నాడు. వేదనిధి తనకు పుత్రులు లేని విషయాన్ని ప్రస్తావించాడు వ్యాసమహర్షి అతనికి తెజోవమ్తులూ,అదృష్టవంతులూ ఇశ్వర్యవంతులైన పదిమంది పుత్రులను అనుగ్రహించి ,జీవితంలో ఏలోటు లేకుండా గడిపి తదనం తరం విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించి వెళ్లబోతుండగా వేదనిధి “ప్రభూ మళ్లీ ఎప్పుడు ఎలా దర్శనం చేసుకోగలనని ప్రార్దించగా వ్యాసులవారు —-

“శృణు విప్ర తవేచ్చా చేత్ దర్శనార్దం తదా త్వయా

పూజనీయో విశేషేణ, కధావాచయితా స్వయం” — అన్నారు

అనగా “పురాణ ఇతిహాసాల గూడార్దాలు ఎవరైతే ఉపదేసిస్తూ ఉంటారో అతడే తన నిజస్వరూపమనీ ఆపౌరాణికుని పూజించవలసింది” గా చెప్పారు .

ఈకధ విన్న తర్వాత వైశంపాయన మహర్షి ఈకధ చెప్పిన నారదుణ్ణే తన గురువుగా భావించి ఆయననే వ్యాసుడుగా భావించి పూజించారు ఈ పూజమూలంగా వ్యాసానుగ్రహం వ్యాసదర్శనం కూడా ఆయనకు లభించాయి. ఈకధ నారదుడు వైశంపాయనునికి చెప్పినట్టుగా బ్రహ్మాండపురాణంలోను, స్వధర్మసింధు, నిర్ణయసింధు అన్న గ్రంధములలోను వివరంగా చెప్పబడింది

ఇప్పటికీ ఎవరైనా ఆధ్యాత్మిక రహస్యాలు, పరమ గురువులయొక్క జీవితం గురించి తెలుసుకోవాలన్నా, వాళ్ళ సాక్షాత్కారం పొందాలన్నా, ఈ ఆషాడ పూర్ణిమ చాలా ముఖ్యమైన రోజుగా ఉన్నది ఇదే వ్యాస మహర్షి జన్మతిధి. ప్రాచీన గాధలు గత కల్పాలలో జరిగిన చరిత్ర సృష్టికి పూర్వం అనేక సృష్టుల్లో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం – ఇలాంటివన్నీ పురాణాల్లో నిహితం చేయబడి ఉన్నాయి. వ్యాసానుగ్రహం లేనిదే ఎవరూ వీటిని బోధించి చెప్పలేరు. అంచేత వ్యాసపూజను ఆషాడ పూర్ణిమనాడు చేసి పౌరాణికుణ్ణి గౌరవించి, ఆయన్ని వ్యాసరూపంగా భావించి, ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. ఈ పూజ గురుపూర్ణిమ నాడు అనగా ఆషాడ పూర్ణిమనాడు ఇప్పటికీ జరుగుతూ వస్తున్నది. ఇదే గురుపూజ. ఇదే గురుపూజా మహోత్సవం.
ఎవరిని పడితే వాళ్ళని దేముళ్ళను చేసి వారికి ఈ గురు పౌర్ణిమ నాడు పూజలు చేయటం తగదు, ధర్మ విరుద్ధం.

 — శ్రీధర శర్మ