జలమయమయిన ముంబై సమీప ప్రాంతాలు

జలమయమయిన ముంబై సమీప ప్రాంతాలు

భారీ వర్షాల ధాటికి ముంబై, ముంబై సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తొలిరోజే భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ముంబైలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షానికి ముంబైలో జనజీవనం స్తంభించింది. ముంబైలోని కుర్లా, బాంద్రా, తదితర ప్రాంతాలతోపాటు థానె, పాల్ఘర్, నవీముంబైసహా అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి.

దీంతో అనేక ప్రాంతాలు జలాశయాలను తలపించాయి. రోడ్డు, రైలు మార్గాలు నదుల రూపందాల్చాయి. శాంటాక్రూజ్‌లో 164.8 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, థానె, పాల్ఘర్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ముంబై లైఫ్‌లైన్లుగా గుర్తింపుపొందిన ముంబై లోకల్‌ రైళ్లపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి.