సంప్ర‌దాయాన్నికొన‌సాగించిన హిమాచ‌ల్ ఓట‌ర్లు 

himachal pradesh voters continued the tradition for bjp

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఓట‌ర్లు ఈ సారీ మార్పు కోరుకున్నారు. ప్ర‌తి ఐదేళ్ల‌కు ప్రభుత్వాన్ని మార్చే రాష్ట్ర ఓట‌ర్లూ ఈ సారీ ఆ సంప్ర‌దాయాన్నే కొన‌సాగించారు. అధికార ప‌క్షాన్ని ప్ర‌తిపక్షంలో కూర్చుండ‌బెట్టి… ఇప్పటిదాకా  ఆ స్థానంలో ఉన్న బీజేపీకి ప్ర‌భుత్వం ఏర్పాటుచేసే బాధ్య‌త అప్ప‌గించారు. 68 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ స్ప‌ష్ట‌మైన ఆధిక్యం సాధించింది.  ప్ర‌భుత్వ అవినీతి కూడా బీజేపీ గెలుపుకు దోహ‌దం చేసింది. కాంగ్రెస్ సీఎం వీర‌భ‌ద్ర‌సింగ్ పై కొన్నేళ్లుగా అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సీబీఐ, ఈడీల విచార‌ణ చేప‌ట్ట‌డంతో కాంగ్రెస్ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారింది.

అవినీతికి వ్య‌తిరేకంగా బీజేపీ విస్తృతంగా నిర్వ‌హించిన ప్ర‌చారాన్ని రాష్ట్ర ఓట‌ర్లు న‌మ్మారు. దాంతోపాటు ర‌హ‌దారుల నిర్మాణంపై బీజేపీ భారీ హామీలు ఇచ్చింది. ప‌ర్వ‌త‌సానువుల్లో ఉండే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ర‌హ‌దారులు అత్యంత కీల‌కం. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ  ర‌హ‌దారుల నిర్మాణం గురించి ఎన్నిక‌ల ప్ర‌చార సభ‌ల్లో ప‌దే ప‌దే ప్ర‌స్తావించింది. అటు రాష్ట్రంలో అదుపుత‌ప్పిన శాంతి భ‌ద్ర‌త‌లు కూడా కాంగ్రెస్ కు ప్ర‌తికూలంగా మారాయి. కొట్ కాయ్ ప్రాంతంలో పాఠ‌శాల బాలిక‌పై కొంద‌రు దుండ‌గులు అత్యాచారం జ‌రిపి, హ‌త్య చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. గుడియా కేసుగా గుర్తింపు పొందిన ఈ దారుణానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు.

సీఎం ఆల‌స్యంగా స్పందించ‌డంతో జ‌ర‌గాల్సిన నష్టం జ‌రిగిపోయింది. అటు కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వం రాష్ట్రంపై పెద్ద‌గా దృష్టిపెట్ట‌లేదు. మూడు నెల‌లుగా గుజ‌రాత్ ప్ర‌చారంలో త‌ల‌మున‌క‌లై ఉన్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌లను పెద్ద సీరియ‌స్ గా తీసుకున్న‌ట్టు క‌నిపించ‌లేదు. కాంగ్రెస్  ఓట‌మిపై సీఎం వీర‌భ‌ద్ర‌సింగ్ కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తంచేశారు. తాము ప్ర‌జారంజ‌కంగా పాలించిన‌ప్ప‌టికీ ఓడిపోయామ‌ని ఆవేద‌న‌వ్య‌క్తంచేసిన ఆయ‌న‌ కాంగ్రెస్ జాతీయ‌స్థాయి నేత‌లు రాష్ట్రంలో ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం కూడా పార్టీ ఓట‌మికి కార‌ణాల్లో ఒక‌ట‌ని  విశ్లేషించారు.