యూసఫ్ గూడలో గొంతుకోసి యువతీ దారుణ హత్య… చంపింది పోలీసే !

Home guard sagar kills girl in Yousufguda for rejecting love

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాదుల దాడులు పెట్రేగిపోతున్నాయి. ఏ పత్రిక, ఏ చానెల్ చూసినా ఇలాంటి సంఘటనలే కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దాడి కలకలం సృష్టించింది. తన ప్రేమను యువతి ఏడాది కాలంగా తిరస్కరిస్తూ వస్తుందనే కోపంతో ఒంటరిగా ఉన్న ఆమెతో మృగంలా ప్రవర్తించాడు. అయినా దారికి రాలేదన్న కోపంతో బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. ఆపై కొన ఊపిరితో ఉన్న యువతి మెడకు చున్నీ చుట్టి ఊపిరాడకుండా చేసి మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాతే దర్జాగా బయటకు వచ్చి షట్టర్ వేసి మరీ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రేమోన్మాదులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఒకవైపు నిర్భయ లాంటి చట్టాలు, సెక్షన్లు వచ్చినా ప్రేమోన్మాదుల దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే వున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు వెంకటలక్ష్మి, తన తల్లిదండ్రులతో కలసి నగరంలో నివసిస్తూ స్థానికంగా ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ జ్యూయెలరీ షాప్ లో పనిచేస్తోంది. అయితే నిన్న ఉదయం షాపు యజమానులు దినేశ్‌, జ్యోత్స్నలు వ్యక్తిగత పనుల నిమితం ఖమ్మం వెళ్లారు. అయితే షాపు చూస్కోమని వెంకటలక్ష్మికి అప్పచెప్పి వెళ్లారు. అయితే ఆమె ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న మధురానగర్‌కు చెందిన సాగర్‌ మధ్యాహ్నం 1.50 గంటలకు షాపులోకి వచ్చాడు. ఎప్పటిలాగే ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. గల్లాలో ఉన్న డబ్బులు తీసుకొని కాసేపు సతాయించాడు. అయితే తనను ఒక యువకుడు వేధిస్తున్నాడని వెంకటలక్ష్మి యజమానికి ఫోన్‌ చేసి చెప్పింది. భయపడ్డ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అయితే ఓ గంట తర్వాత మరో ఇద్దరితో మందు మత్తులో షాపు వద్దకు వచ్చాడు. మరోసారి వెంకటలక్ష్మిని ప్రేమించాలని కోరాడు. మళ్ళీ ఆమె అలాగే ప్రవర్తించడంతో విచక్షణ కోల్పోయి తనతో తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసాడు. తీవ్ర రక్తస్రావంతో వెంకటలక్ష్మి కిందపడి కొట్టుకుంది. అయితే ఆమె ఇంకా కొన ఊపిరితో ఉన్నట్టు గమనించిన యువకుడు ఆమె చున్నీతో మెడ చుట్టు ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసాడు. ఆమె మరణించినట్టు నిర్ధారించుకున్న తర్వాత షెట్టర్‌ వేసి పారిపోయాడు. ఇదంతా మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జరిగింది సాయంత్రం 5 గంటలకు ఖమ్మంలో ఉన్న యజమాని దినేశ్‌ షాపులో ఉన్న సీసీ కెమెరాలను సెల్‌ఫోన్‌ ద్వారా చూసేందుకు ప్రయత్నించగా అవి పనిచేయలేదు. వెంకటలక్ష్మికి ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో యువతి తండ్రితోపాటు తన స్నేహితుడు జానీ పాషాకు సమాచారం ఇచ్చాడు. వారు షట్టర్ ఓపెన్ చేసి షాపులోకి వెళ్లేసరికి వెంకటలక్ష్మి రక్తపుమడుగులో పడి ఉంది.

దీంతో యజమాని స్నేహితుడు జానీపాషా జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. జరిగిన ఘటనపై వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌లు దర్యాప్తు ప్రారంభించారు. హంతకుడు బ్లేడ్‌ను అక్కడే పడేసి పోవడంతో దానిని, దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సీసీ కెమెరాలు ఉన్న విషయాన్ని నిందితుడు గుర్తించి, హత్యకు ముందు దానిని ఆపేశాడా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడు సాగర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది సాగర్‌ను హోంగార్డుగా గుర్తించారు. గతంలో ట్రాఫిక్‌ విభాగంలో డీసీపీ పనిచేసిన అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేశాడని ఇప్పుడు ఆ అధికారి తండ్రి విశ్రాంత ఐపీఎస్‌ వద్ద పనిచేస్తున్నాడు. హత్య చేసిన అనంతరం సాగర్‌ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వద్దకు వెళ్ళగా పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా సాగర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని తెలిసింది కానీ ఈ విషయం మీద పోలీసులు అయితే అధికారిక ప్రకటన చేయలేదు.