ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఝార్ఖండ్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధన్బాద్ గోవింద్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హింద్ హోటల్ వద్ద వంతెన వద్ద అదుపు తప్పిన కారు.. 100 మీటలర్ల లోతులోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురూ ఘటనా స్థలిలోనే మృతిచెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ఘటనా స్థలిలో లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులను వసీమ్ అక్రమ్, షకీల్ అక్తర్‌గా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న కారును స్థానికుల సాయంతో బయటకు తీశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వేగంగా వెళుతుండగా.. మలుపును గమనించకపోవడంతో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిందని ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతులు రామ్‌గఢ్‌లోని అసోటాండ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరు రామ్‌గఢ్ నుంచి అనసోల్‌కు స్విఫ్ట్ డిజైర్ కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి బాధిత కుటుంబానికి పోలీసులు సమాచారం అందజేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.