భార్య విడాకులు భరించలేక.. భర్త ఆత్మహత్య

ఇన్నాళ్లు భర్త దూరమైతే భార్యలు దిగులు విచారం చెందడం చూశాం. ఇప్పుడు కాలం మారింది. భార్యలే ఏకంగా భర్తలకు దూరంగా ఉండిపోయి భర్తలను ఆందోళనకు గురిచేస్తూ ప్రాణాలను తీసుకొనేలా చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భార్య విడాకులు ఇవ్వడంతో కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న రాంబాబు లాక్‌డౌన్‌ తో మరింతగా ఒంటరి వాడు అయిపోయాడు. దీంతో ఆ ఒంటరితనాన్ని భరించలేక తీవ్ర మనోవేదనకు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే అసలు ఏం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈఘటన జరిగింది. టి.నరసాపురం మండల కేంద్రానికి చెందిన బైగాని రాంబాబు అనే వ్యక్తికి చాలా ఏళ్ల క్రితం ఓ యువతితో పెళ్లైంది. ఇద్దిరికీ మనస్పర్థలు రావడంతో పదేళ్ల క్రితం విడాకులు తీసుకుని విడివిడిగా నివాసముంటున్నారు. అప్పటి నుంచి ఏలూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న రాంబాబు టి.నరసాపురంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. కరోనా వైరస్ కారణంగా సంస్థ మూతపడటంతో కొద్దిరోజులుగా గదికే పరిమితమైపోయాడు. దీంతో ఒంటరితనాన్ని భరించలేక మనోవేదనకు లోనై రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా అతడిని గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం అందించారు. దీంతో వారు రాంబాబును వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాంబాబు ప్రాణాలు విడిచాడు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.