ఐర్లాండ్‌ వన్డే సిరీస్‌ రద్దు

ఐర్లాండ్‌ వన్డే సిరీస్‌ రద్దు

కోవిడ్‌-19 కలకలం నేపథ్యంలో యూఎస్‌ఏ, ఐర్లాండ్‌ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌ రద్దైంది. ఈ విషయాన్ని క్రికెట్‌ ఐర్లాండ్‌ ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించింది. ‘‘ముందుగా నిర్ణయించినట్లుగా ఐర్లాండ్‌, అమెరికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌ రద్దు అయిందని చెప్పడానికి చింతిస్తున్నాం’’ అని ప్రకటన విడుదల చేసింది. యూఎస్‌ఏ క్రికెట్‌, క్రికెట్‌ ఐర్లాండ్‌ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.కాగా ఐరిష్‌ జట్టు సహాయక సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్‌ ఫలితం వచ్చింది. అయితే, చాలా మంది క్రికెటర్ల పార్ట్‌నర్స్‌కు మాత్రం పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అందరినీ ఐసోలేషన్‌కు పంపారు. అనేక చర్చల అనంతరం ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సిరీస్‌ను రద్దు చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం గురించి క్రికెట్‌ ఐర్లాండ్‌ హై పర్ఫామెన్స్‌ డైరెక్టర్‌ రిచర్డ్‌ హోల్డ్’స్‌వర్త్‌ … ‘‘మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు అమెరికాకు ధన్యవాదాలు.

సిరీస్‌ రద్దు నిర్ణయం బాధించినా ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యం’’ అని తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఐర్లాండ్‌ జట్టు డిసెంబరు 31న వెస్టిండీస్‌ పర్యటనకు బయల్దేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన సహాయక సిబ్బంది ఐసోలేషన్‌ పూర్తి చేసుకుని, పూర్తిగా కోలుకున్న తర్వాత జట్టుతో చేరనున్నారు. ఇక ఈ సిరీస్‌ తర్వాత వీలు కుదిరినపుడు అమెరికా- ఐర్లాండ్‌ వన్డే సిరీస్‌ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.