కెనడా వివాదంపై జైశంకర్‌ సంచలన కామెంట్స్

Attack on Israel is never an act of terrorism: Jaishankar
Attack on Israel is never an act of terrorism: Jaishankar

‘ఖలిస్థానీ’ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుతో భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కెనడాతో పాటు పలు దేశాలు స్పందించాయి. తాజాగా ఈ వివాదంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు. ఐరాస 78వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా న్యూయార్క్‌ వెళ్లిన జై శంకర్‌ ఈ వివాదంపై కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌లో మాట్లాడారు.

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలను జైశంకర్‌ మరోసారి ఖండించారు. భారత్‌ అలాంటి చర్యలకు పాల్పడదని .. ట్రూడో ప్రభుత్వం చేసిన ఆరోపణలకు సంబంధించి ఇంతవరకు వారివైపు నుంచి ఎటువంటి ఆధారాలు అందలేదని తెలిపారు. నిజ్జర్‌ హత్యకు సంబంధించి తగిన సమాచారం అందిస్తే.. భారత్ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

మరోవైపు ఫైవ్‌ఐస్‌ కూటమిలో పంచుకున్న సమాచారం ఆధారంగానే ట్రూడో ఆ ఆరోపణలు చేసుండొచ్చని ఇటీవల యూఎస్‌ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యల గురించి ఓ రిపోర్టర్‌ మంత్రిని ప్రశ్నించారు. దీనికి జైశంకర్ ఘాటుగా బదులిస్తూ.. తాను ఆ ఫైవ్‌ ఐస్‌లో భాగం కాదని.. అలాగే ఎఫ్‌బీఐకి చెందిన వ్యక్తినీ కానని.. ఈ ప్రశ్న అడగాల్సింది తనను కాదనుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు.