బీహార్ లో దుర్యోధ‌న‌,దుశ్శాస‌న ప‌ర్వం…

Jehanabad molestation case in Bihar 4 people arrested

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మ‌హిళ‌లు, చిన్నారుల ర‌క్ష‌ణ‌కు ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకొస్తున్నా మృగాళ్ల అకృత్యాలు ఆగ‌డం లేదు. క‌థువా, ఉన్నావో అత్యాచారాలు దేశ‌వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నా… సామాజిక చైత‌న్యం కూడా పెర‌గ‌డం లేదు. తాజాగా బీహార్ లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న… దుర్యోధ‌న‌, దుశ్శాస‌న ప‌ర్వాన్ని క‌ళ్ల‌కు క‌ట్టింది. సాధార‌ణంగా నేరం చేసేవాళ్లే కాదు… నేరం జ‌రుగుతున్న‌ప్పుడు అక్క‌డే ఉండి దాన్ని ఆప‌డానికి ప్ర‌య‌త్నించ‌నివాళ్లు కూడా నేర‌స్థుల‌తో స‌మానమ‌ని మ న్యాయ‌స్థానాలు చెబుతుంటాయి. అయినా స‌రే… సాధార‌ణ జ‌నం ఆలోచ‌న‌ల్లో మార్పు రావ‌డం లేదు. విప‌త్క‌ర‌ప‌రిస్థితుల్లో చిక్కుకున్న బాలిక‌ను ర‌క్షించాల్సిన బాధ్య‌త ఉన్న తోటిమ‌నుషులు… త‌మ క‌ళ్ల‌ముందు జ‌రుగుతున్న దారుణాన్ని సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించడానికి ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్ప‌… ఆమెను ర‌క్షించ‌డానికి ఒక్క‌రూ ముందుకు రాలేదు.

బీహార్ లోని జెహ‌నాబాద్ లో శ‌నివారం సాయంత్రం న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే ఓ బాలిక‌పై ఎనిమిదిమంది వేధింపులకు పాల్ప‌డ్డారు. రోడ్డుపై వెళ్తున్న ఓ బాలిక‌ను అట‌కాయించిన ఎనిమిది మంది యువ‌కులు ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. ఆమె వారిని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా… ఆ యువ‌కులు మ‌రింత విచ‌క్ష‌ణార‌హితంగా బాలిక దుస్తులు చించివేశారు. ఆమె కాలుప‌ట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఇదంతా చూస్తూ కూడా అక్క‌డున్న వారెవ‌రూ ఆ నిస్స‌హాయ బాలిక‌ను ర‌క్షించేందుకు వెళ్ల‌లేదు. ఒక్క‌రు కూడా ఆ దుర్మార్గుల ఆగ‌డాన్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌లేదు… స‌రిక‌దా… చోద్యం చూస్తున్న‌ట్టుగా ఫోన్ల‌లో ఆ దృశ్యాన్నంతా వీడియో తీశారు. అనంత‌రం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైర‌ల్ గా మార‌డంతో పోలీసుల దృష్టికి వెళ్లింది.

వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వీడియో ఎవ‌రు పోస్ట్ చేశారు… ఏ మొబైల్ నుంచి చేశారు అన్న‌ది ఆరాతీశారు. చివ‌ర‌కు ఆ వీడియో తీసిన వ్య‌క్తిని గుర్తించి ఘ‌ట‌న వివ‌రాలు తెలుసుకున్నారు. గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు నిందితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మ‌రో ఇద్ద‌రు నిందితులు పరారీలో ఉన్నారు. నెటిజ‌న్లు కూడా ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తంచేస్తున్నారు. వేధింపుల‌కు పాల్ప‌డిన మృగాళ్ల‌తో పాటు… న‌డిరోడ్డుపై కీచ‌క‌ప‌ర్వం జ‌రుగుతున్నా… సంఘ‌ట‌నాస్థ‌లంలో ఉండి కూడా బాలిక‌ను ర‌క్షించ‌కుండా చోద్యంచూసిన వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.