మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. అదే ‘గాడ్ ఆఫ్ వార్’ God of War.
నెక్స్ట్ లెవెల్ విజువల్ ట్రీట్‌గా ‘గాడ్ ఆఫ్ వార్’!
త్రివిక్రమ్ ఈ సినిమాను గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ విజువల్ ప్రాజెక్ట్‌గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథ, పాత్రలు, విజువల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా సంగీతానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.
కొత్త సంగీత దర్శకుడి కోసం అన్వేషణ?
‘గాడ్ ఆఫ్ వార్’ కోసం కొత్త సంగీత దర్శకుడిని తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంగీత దర్శకుడి విషయంలో మార్పులు జరిగినప్పటికీ, చివరకు థమన్‌కే ఆ బాధ్యతలు దక్కాయి. అయితే ‘గాడ్ ఆఫ్ వార్’ విషయంలో మాత్రం త్రివిక్రమ్ కొత్త ప్రయోగం చేయాలనుకుంటున్నారట.
అనిరుధ్ లేదా సాయి అభ్యంకర్?
త్రివిక్రమ్ అభిరుచికి, ఈ భారీ ప్రాజెక్ట్ స్థాయికి సరిపోయే సంగీత దర్శకుడి కోసం అన్వేషణ జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అనిరుధ్ రవిచందర్, సాయి అభ్యంకర్ పేర్లు చర్చకు వస్తున్నాయి. మరోవైపు టాలీవుడ్ నుంచే ఓ ప్రతిభావంతమైన సంగీత దర్శకుడికి అవకాశం దక్కవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి, ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సంగీత బాధ్యతలు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మేకర్స్ అధికారికంగా ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.






